వినాయక నవరాత్రి ఉత్సవాల్లో హైలెట్ పార్ట్ అంటే లడ్డూ వేలం పాట అందులోనూ హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూకు విపరీతమైన క్రేజ్. వేలంలో లడ్డూ ధర లక్షల్లో పలుకుతుంది. 2020లో కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలు సరిగా జరగలేదు. లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. అంతకుముందు ఏడాది 2019లో లడ్డూ రూ.17 లక్షలు పలికింది. ఈ ఏడాది అంతకుమించి ఏకంగా రూ.18.90 లక్షలు పలికింది. ఈ లడ్డూను ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భారీ ధర చెల్లించి దక్కించుకున్నారు.
లడ్డూను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లడ్డూ వేలంలో పాల్గొంటానని 2019లో మొక్కుకున్నట్లు రమేష్ యాదవ్ తెలిపారు. అనుకున్నట్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అఖండ విజయం సాధించింది. గతేడాది కరోనా కారణంగా మొక్కు చెల్లించుకోవడం కుదరకపోవడంతో ఈ ఏడాది భారీ ధర చెల్లించి లడ్డూను దక్కించుకున్నట్లు రమేష్ తెలిపారు.