తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిన రోజా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం నగరి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఓ వైపు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోకి ఏడేళ్ల నుంచి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. అయితే ఏపిలో రోజాని ఫైర్ బ్రాండ్ అంటారు.
ప్రతిపక్షాలపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతూ.. ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంటారు. కళాకారులతో కలిసి డప్పు కొట్టినా.. కబడ్డీ కోర్టులో కూత పెట్టినా రోజా ఏది చేసినా సంచలనమే. తాజాగా నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పం ఎస్వీ కోయిల్ వీధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సదుపాయాలతో పవర్ లూమింగ్ మిషన్ల యూనిట్ ను ప్రారంభించారు. సందర్భంగా స్వయంగా మగ్గంపై కూర్చుని చీర నేశారు. ముఖ్యమంత్రి జగన్ చిత్రాలతో కూడాన చీర నేసి తన అభిమానం చాటుకున్నారు రోజా. అనంతరం చీరను ప్రదర్శించారు.
తర్వాత వస్త్ర రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని నేతన్నలు ఎదగాలని ఆమె కోరారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని నేతన్నలు తమదైన రంగంలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. మన జిల్లాలోని నగరిలోనే ఈ విధమైన మిషన్లను స్థాపించి నేతన్నలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వస్రాల్లో నూతన పద్ధతులు పాటించి నేతన్నలు ముందుకు కదలాలని సూచించారు. ఈ సందర్భంగా చీరపై సీఎం ఫోటో, ఎమ్మెల్యే రోజా ఫోటో ప్రింట్ చేసినవి ప్రదర్శించారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.