అనంతపురం జిల్లాను కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడదీస్తున్న ఏపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో హిందూపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి జిల్లా కావాలని ప్రజలు ఎవరూ అడగలేదని జిల్లా కేంద్రంగా హిందూపురం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చాలా కాలంగా అభిప్రాయం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కూడా హిందూపురం జిల్లా కేంద్రం అవుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం పుట్టపర్తి వైపు మొగ్గు చూపడం హిందూపురం వాసుల్ని నిరాశపరిచింది. దీంతో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ హిందుపురంని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష పోరాటంలోకి దిగారు. హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి మౌనదీక్ష చేపట్టారు. గురువారమే హిందూపురం చేరుకున్న బాలకృష్ణ పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో మౌనదీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకూ ఆయన మౌనదీక్ష చేస్తారు. జిల్లాల విభజనకు మొదటి నుంచి మద్దతుగా మాట్లాడుతున్న బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మాట తప్పడంతో ప్రత్యక్షంగా ఉద్యమంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. “హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, సత్యసాయి జిల్లాగా పేరుపెట్టాలి. అర్థరాత్రి హడావుడిగా జిల్లా ప్రకటిస్తూ జీవో జారీ చేశారు. అవసరమైతే హిందుపురం జిల్లా కోసం నా ఎమ్మెల్యే పదవికే రాజీనామ చేస్తాను. హిందుపురాన్ని జిల్లాగా చేయడానికి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి” అని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హిందూపురం జిల్లాను సాధించాలని పట్టుదలగా ఉన్నారు బాలకృష్ణ. అందర్నీ కలుపుకని వెళ్లి హిందుపురం జిల్లాగా సాధించే వరకు పోరాటం చేయాలని బాలయ్య భావిస్తున్నారు. బాలయ్య మౌన పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.