ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం.. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు, అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. ఆయన మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో గౌతమ్ రెడ్డి మృతి చెందడానికి ముందు అసలేం జరిగిందో వివరించాడు మంత్రి ఇంట్లో వంట మనిషిగా పని చేస్తోన్న కొమురయ్య. అతడు తెలిపిన వివరాల ప్రకారం మంత్రి గౌతమ్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు దుబాయ్ నుండి వచ్చారు. ఆదివారం ఉదయం ఇంట్లోనే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట ఫంక్షన్ ఉంది అని చెప్పి వెళ్లారు.
తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చారు. అప్పటినుండి ఇంట్లోనే ఉన్నారు. ఫిబ్రవరి 21, సోమవాంరం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి వస్తుందని కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఆయనకు ఒంటి నిండా చెమటలు పట్టినట్లు వెల్లడించాడు కొమురయ్య. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. రోజూ ఉదయం కాఫీ తాగే వారు కానీ ఇవాళ ఆయన కాఫీ కావాలని అడగలేదు. దుబాయ్ నుండి వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదని తెలిపాడు కొమరయ్య. ఆరోగ్యంగా ఉన్న గౌతమ్ రెడ్డి ఇలా ఉన్నట్లుండి మరణించడం ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.