చేతులే లేవు. కానీ ఆత్మవిశ్వాసం టన్నుల్లో ఉంది. తనను ఎగతాళి చేస్తున్న ప్రతికూల పరిస్థితులకు గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల కొద్దీ భయాన్ని పరిచయం చేశారు. కట్ చేస్తే ఇవాళ అతనొక గొప్ప హోదాలో ఉన్నారు. బ్యాంకు ఉద్యోగం అంటే ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలి. ఆ ఆపరేటర్ కి చేతులు ఉండాలిగా. కనీసం పెన్ను పట్టుకుని రాయడానికి వేళ్ళు ఉండాలిగా. అవేమీ లేకపోయినా అతను జాబ్ కొట్టారు. అంతేనా ఉద్యోగంలో చేరిన అతి తక్కువ సమయంలోనే ప్రమోషన్ కూడా కొట్టారు. ఆయన ఎవరో తెలుసా?
మామూలుగా అన్ని అవయవాలు బాగున్న మనుషులు కూడా డైలీ చేసే పని చేయడానికే విసుగు చెందుతారు. పళ్ళు తోముకోవాలంటే బద్ధకం, స్నానం చేయాలంటే బద్ధకం, ట్రాఫిక్ లో రెండు నిమిషాలు ఆగాలంటే నీరసం, పని చేయాలంటే నీరసం ఇలా రకరకాల కారణాలతో రోజూ తమని తాము తిట్టుకునే మనుషుల ఉన్నారు. అన్ని అవయవాలు ఉన్నా కూడా ఏదో ఒక లోపంతో పని చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. అన్ని అవయవాలు ఉండడం వల్లేనేమో ఇన్ని రోగాలు వస్తున్నాయి. కానీ అవయవాలు లేకపోయినా ఏ రోగం లేకుండా బతికే మనుషులు ఉన్నారు. వాళ్ళే దివ్యాంగులు. నిజానికి అన్ని అవయవాలు సరిగా ఉన్న పని చేయడం చేతకాని వాళ్ళని వికలాంగులు అనాలి. కానీ అవయవాలు లేకపోయినా, సహకరించకపోయినా గానీ కష్టపడి పని చేస్తూ జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నారు.
కాళ్ళు ఉంటే కళ్ళు ఉండవు, కంటి చూపు ఉంటే చేతులు ఉండవు. ఇలా ఏదో ఒకటి లేకపోయినా గానీ ఆత్మస్థైర్యం అనే ఆయుధంతో దూసుకుపోతున్నారు. చదువులోనూ, ఉద్యోగంలోనూ, ఆటల్లోనూ, పోటీల్లోనూ అన్నిటిలోనూ ప్రతిభతో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో సునీల్ ఒకరు. ఈయన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేట్ చేయడం గానీ, రాయడం గానీ చాలా సులువుగా చేస్తున్నారు. చేతికి వేళ్ళు లేకపోయినా గానీ మోచేతికి పెన్ను కట్టుకుని మరీ రాస్తున్నారు. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది. తనకు లోపం ఉందని ఏనాడూ కుంగిపోలేదు.
ఆ విషయం అతని ఆత్మస్థైర్యాన్ని చూస్తేనే అర్థమవుతుంది. చేతులు లేకపోతేనేం చేయగలనన్న ఆత్మవిశ్వాసం ఉంది కదా అని ముందుకు వెళ్లారు. ఇప్పుడు డిప్యూటీ మేనేజర్ గా ప్రమోషన్ కూడా పొందారు. మనిషికి ఆత్మవిశ్వాసాన్ని మించిన గురువు మరొకరు ఉండరు. ఆత్మవిశ్వాసాన్ని గురువుగా భావించి, ఆత్మస్థైర్యాన్ని ఆయుధంగా చేసుకుని అడ్డొచ్చిన ప్రతికూల పరిస్థితులను మట్టికరిపించి ఈరోజు ఉన్నతమైన హోదాను అనుభవిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు సునీల్. లోపం ఉన్నా కూడా లోకాన్ని జయించవచ్చునని నిరూపించారు. సునీల్ డిజేబుల్డ్ పర్సన్ కాదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. చేతులు లేకపోయినా లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్న సునీల్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.