చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం మోర్దానపల్లెలోని అమర రాజా బ్యాటరీ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో పరిశ్రమలోని టీబీడీ ప్లాంట్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో.. ప్లాంట్‌లో సుమారు 250 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్రిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని.. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరింజిన్లతో మంటలను ఆర్పివేశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ప్రమాదంలో కార్మికులు ఎవరికి ఏం కాలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే కార్మికులందరినీ సురక్షితంగా బయటకు పంపినట్లు అమరరాజా బ్యాటరీ పరిశ్రమ యాజామాన్యం తెలిపింది. అందువల్లే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. కాకపోతే కొంతమంది కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంగురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.