ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల కారణంగా పంట నష్టమే కాకుండా.. పలువురు అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. ఏపీలో ఓ ఊరిలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.
ఇటీవల కొన్ని గ్రామాల్లో ప్రజలు ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురి కావడం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే హఠాత్తుగా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితితులు రావడానికి ముఖ్యకారణం కలుషిత నీరు, కొన్ని రకాల వైరస్ లు ప్రబలిపోవడం వల్ల జరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. కానీ, గ్రామస్థులు మాత్రం తమ ఊరికి ఏదో కీడు నెలకొందని.. మూఢ విశ్వాసాలను నమ్ముతూ భయంతో వణికిపోతుంటారు. అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామ పరిధిలో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి నుంచి దాదాపు 31 మంది వరకు వరుసగా వాంతులు, విరేచనాలు ఇతర ఇబ్బందులతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. వారిలో కరియమ్మ.. వయసు 75 సంవత్సరాలు మృతి చెందింది. దీంతో గ్రామ ప్రజలు తమ ఊరికి ఏదో కీడు నెలకొందని.. అందుకే ఇలా ఉన్నట్టుండి గ్రామ ప్రజలు అస్వస్థతకు గురి కావడం.. ఓ మహిళ చనిపోవడం జరిగిందని భయంతో వణికిపోతున్నారు. గంట గంటకు కేసులు పెరుగుతుండటంతో ఏం చేయాలో తోచక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
బేలోడు గ్రామంలో ఈ హఠాత్ పరిణామానికి గల కారణం ఏంటో తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు బయలుదేరారు. గ్రామీణ నీటి సరఫరా, వైద్య శాఖ అధికారులు సందర్శించారు. గ్రామంలో బీసీ కాలనీ కింది వీధిలో దాదాపు వంద కుటుంబాల వరకు నివసిస్తున్నారు. ఈ ప్రాంతానికి తాగునీరు సక్రమంగా అందకపోవడంతో కుళాయిల చుట్టూ రెండు మూడు అడుగుల మేర గుంతలు తవ్వుకున్నారు. మంచినీరు వచ్చే పైపు అందులోనే వదిలేస్తుంటారు. ఆదివారం, సోమ వారాల్లో కురిసిన వర్షం కారణంగా నీటి గుంతలు నిండిపోయాయి. ఈ క్రమంలో కుళాయిలో నీరు ఇంకిపోయింది. సోమవారం తాగునీటీని సరఫరా చేశారు.. ఈ విషయం గమనించకుండా.. కుళాయిలు శుభ్రం చేయకుండా నీటిని తాగడంతో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురై ఉంటారని తెలుస్తుంది.