ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాను వెనక్కి ఇచ్చేసిన మహిళ! ఎంత గొప్ప మనసో!

ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి. వెయ్యి, రెండు వేలు ఇస్తుందంటే ఆ డబ్బు కోసం కోటీశ్వరుడు కూడా కక్కుర్తిపడతాడు. డబ్బున్న వాళ్ళే అంతలా ఎగబడుతుంటే నిజమైన అర్హులు పేదవారు ఎగబడరా. కానీ ఒక మహిళ తనకు ప్రభుత్వం ఇండ్ల స్థలం ఇస్తే వద్దని చెప్పేశారు. ఇండ్ల స్థలం ఇస్తే వద్దని ఎవరైనా అంటారా?

  • Written By:
  • Updated On - June 6, 2023 / 12:14 PM IST

పేద ప్రజలకు ఆర్థికంగా చేయూతనిస్తుంటాయి ప్రభుత్వాలు. ఆయా పథకాల పేరుతో వారికి ఆర్థిక సహాయం చేస్తుంటాయి. ఈ క్రమంలో అర్హత లేకపోయినా కూడా కొందరు తప్పుడు పత్రాలు చూపించి ప్రభుత్వ పథకాలను అన్యాయంగా అనుభవిస్తుంటారు. దీని వల్ల ఒక పేదవాడు అన్యాయం అయిపోతున్నాడు. ప్రభుత్వాలు ఎంత పగడ్బందీగా వ్యవహరించినా ప్రభుత్వాన్ని మోసం చేసే వాళ్ళు అక్కడక్కడా ఉంటున్నారు. ఎకరాల ఎకరాలు భూమి ఉండి, కోట్ల ఆస్తులు ఉన్నవారు కూడా ప్రభుత్వం ఇచ్చే ఉచితాలకు ఎగబడుతున్నారు. కానీ ‘నాకు ఉచితాలు అవసరం లేదు, ఆర్థికంగా నా పరిస్థితి బాగానే ఉంది, నా కాళ్ళ మీద నిలబడగలుగుతున్నాను’ అని పథకాలను వద్దని చెప్పే నిజాయితీపరులు ఎంతమంది ఉన్నారు. అసలు ఇలాంటి వారు ఉంటారో లేదో అన్న డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ఉన్నారు. ఒకామె ఉన్నారు.

ఆమెది గుంటూరు జిల్లాలోని యర్రబాలెం గ్రామం. ఆమె పేరు దండిభొట్ల నాగ సీత కనకదుర్గ. ఈమె చేసిన పనికి మీరు శభాష్ అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఆమెకు ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం వచ్చింది. కానీ ఈమె ఆ స్థలం నాకు ఇవ్వొద్దు, అర్హులైన వేరొకరికి ఇవ్వండి అని చెప్పారు. సొంతింటి కల అనేది ఏ ఒక్కరిదో కాదు. అందరిదీ. ప్రతి ఒక్కరికీ సొంతింట్లో ఉండాలనే ఉంటుంది. కానీ స్థలం కొనాలంటేనే చుక్కలు కనబడుతున్నాయి. పేదవారికైతే స్థలం కొనడం అంటే గగనమే. అలాంటి పేదవారి సొంతింటి కలను ఏపీ ప్రభుత్వం నిజం చేస్తుంది. రాష్ట్రంలో ఇళ్ళు లేని పేదవారికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్ల స్థలం పట్టా అందజేస్తుంది.

ఈ క్రమంలో గుంటూరు జిల్లా యర్రబాలెం గ్రామానికి చెందిన దండిభొట్ల నాగ సీత కనకదుర్గకు కూడా అధికారులు అర్హురాలిగా గుర్తించి పట్టా అందజేశారు. ఆమెకు 2019లో సొంతిల్లు లేదని స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె భర్త సుబ్రహ్మణ్య శర్మ పేరు మీద ఉన్న వంద చదరపు గజాల స్థలాన్ని అమ్మేసి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్ లోనే ఉంటున్నారు. ప్రభుత్వం తాజాగా ఆమెను అర్హురాలిగా గుర్తించింది. ఆ విషయం అధికారులకు తెలియక ఆమెకు కూడా పట్టాను మంజూరు చేశారు. కానీ ఆమె ఆ పట్టా తీసుకోలేదు.

తనకు సొంతిల్లు ఉందని.. పేదలకు చెందాల్సిన స్థలాన్ని తాను పొందడం సరికాదని.. అర్హులైన వేరొకరికి ఈ ఇంటి స్థలాన్ని ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆమె లేఖ రాశారు. ఆమె చేసిన పనికి అధికారులు ప్రశంసిస్తున్నారు. మరి ఆర్థిక శక్తి బాగుండి ఉచిత పథకాలు వస్తుంటే గుట్టు చప్పుడు కాకుండా అనుభవించేస్తున్న జనం ఉన్న ఈ సమాజంలో 48 గజాల స్థలం ఇచ్చినా కూడా వద్దని చెప్పి అన్నారంటే ఆమెకు ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. మరి ఆమెకు ఒక సెల్యూట్ సరిపోతుందా? ఇలాంటి నిజాయితీపరులు మీ ఇంట్లో గానీ, మీ ఊర్లో గానీ ఉన్నారా? ఉంటే వారికొక సెల్యూట్ చేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed