గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పి రావడంతో పరీక్షల కోసం గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు. వెంటనే ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన నియోజకవర్గంలో అభివృద్ది కోసం కృషి చేస్తున్నారు రామకృష్ణారెడ్డి. పలు కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు.
కాగా, నిన్న మంగళగిరి-తాడేపల్లి పరిధిలోని పలు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ బిజీగా గడిపారు. నరసింహస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. సాయంత్రం పెదకాకాని తన నివాసానికి బయలుదేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్వల్పంగా ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రికి వెళ్లారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.