ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీనిపై చర్చించేందుకు చిరంజీవి సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో మంచు కుటుంబం నుంచి ఎవరు లేరు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, ప్రముఖ హీరో – నిర్మాత మంచు విష్ణు, సీఎం జగన్ ని కలిశారు. జగన్‌ను కలవడం కోసం హైదరాబాద్ నుంచి అమరావతికి విష్ణు వచ్చారు. విష్ణు మా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత జగన్ ని కలవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ అయ్యారు. ఆయన వాహనాన్ని భద్రతా సిబ్బంది నేరుగా లోపలకు పంపించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇండస్ట్రీ తరఫున హీరోలు కలిసి వచ్చిన తర్వాత… మంత్రి పేర్ని నానిని ఇంటికి ఆహ్వానించారు మోహన్ బాబు. ఆ తర్వాత విష్ణు చేసిన ట్వీట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో జగన్ – విష్ణు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్. నారాయణమూర్తి తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం త్వరలోనే పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడుతుందని ఆశిస్తున్నట్టు చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్-మంచు విష్ణుల భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.