తన భార్య, కూతురిని చూసి వారం రోజులైందని.. వారం రోజుల నుంచి వారు కనబడడం లేదని.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని న్యాయం కోసం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన కిషోర్ చంద్రారెడ్డి.. భార్య శ్రావణి, పదేళ్ల కూతురితో కలిసి ఓ కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. గతంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉండేవారు. ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ ఆసుపత్రిలో పని చేసేవారు. అయితే వీరి ఇంటి సమీపంలో ఉండే కిరాణా వ్యాపారి శివయ్య.. కిషోర్ కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే శివయ్య సంబంధీకులు కిషోర్ ను బెదిరించడంతో జంగారెడ్డగూడెం నుంచి వెళ్లిపోయారు. తిరుపతి జిల్లా పాకాల సమీపంలో ఓ కోళ్ల ఫారం లో చేరారు. ప్రస్తుతం ఇక్కడే పని చేస్తున్నామని కిషోర్ వెల్లడించారు.
అయితే అనారోగ్యం కారణంగా తన భార్య ప్రతి నెలా జంగారెడ్డిగూడెంలో ఆసుపత్రిలో చూపించుకుని వస్తుందని అన్నారు. జంగారెడ్డిగూడెం వెళ్లిన ప్రతిసారీ శివయ్యపై పెట్టిన కేసును రాజీ చేసుకోవాలంటూ బెదిరించడంతో భార్యను జంగారెడ్డిగూడెం కాకుండా గుంటూరులో చూపించుకోమని పంపించానని అన్నారు. ఈ నెల 3న సాయంత్రం తన భార్య, కూతురు పాకాలలో రైలు ఎక్కి వెళ్లారని.. ఆరోజు రాత్రి 11 గంటలకు మాట్లాడారని.. ఆ తర్వాత ఆచూకీ లేదని అన్నారు. చివరిసారిగా ఫోన్ లో మాట్లాడినప్పుడు తెనాలి సమీపంలో ఉన్నట్లు చెప్పారని.. ఆ తర్వాత ఎన్ని సార్లు ప్రయత్నించినా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని అన్నారు. గుంటూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదని అన్నారని.. సివిల్ పోలీసుల దగ్గరకు వెళ్తే రైల్వే పోలీసులు చెబుతారని అంటున్నారని.. గుంటూరు, తెనాలి, విజయవాడ వెళ్లి అధికారులను కోరినా కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భార్య, కూతురు వారం రోజులుగా కనిపించడం లేదని, ఏమయ్యారో తెలియడం లేదని.. శివయ్య మనుషులు ఏమైనా చేశారేమో అన్న అనుమానం ఉందని కిషోర్ ఆవేదన చెందుతున్నారు. తన భార్య, కూతురు కనిపించడం లేదని జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫోన్ లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే తన గోడును ఎవరూ వినిపించుకోకపోవడంతో తన భార్య, కూతురు ఆచూకీ తెలపాలంటూ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తన బాధను చెప్పుకున్నారు. మరి పోలీసులు ఈ విషయం మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే రెండు ప్రాణాలను కాపాడిన వారవుతారు. మరి దీనిపై స్పందించేలా షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.