ప్రతి ఏడాది ఎంతో మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసి మంచి స్కోర్ సాధిస్తూంటారు. అలా పదవ తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు చాలా కష్టపడుతుంటారు. అలా కష్టపడి చాలా మంది విద్యార్థులు మంచి స్కోరే సాధిస్తారు. కానీ 600కు 600మార్కులు సాధించడం అనేది సాధ్యమయ్యే పనేనా? కానీ ఓ వ్యక్తికి టెన్త్ లో నూటికి నూరు శాతం మార్కులు వచ్చాయి. సదరు వ్యక్తి అటెండరు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జీజీహెచ్ లో పారామెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో భాగంగా అటెండర్ పోస్టులకు పదో తరగతిని అర్హతగా నిర్దేశించి.. దరఖాస్తులకు ఆహ్వానించారు అధికారులు. ఈ క్రమంలో ఈ పోస్టులకు చాలా సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. అతను 2018లో పదో తరగతి పూర్తి చేసినట్లు దరఖాస్తులో పొందుపరిచాడు.
అటెండర్ పోస్టులకు ఎంపికలో భాగంగా 600, 582, 574 మార్కులు సాధించిన ముగ్గురు అభ్యర్థులను అటెండర్లుగా ఎంపిక చేశారు. వారు బుధవారం ఉద్యోగాల్లో చేరారు. ఎంపికైన అభ్యుర్థుల జాబితాను పరిశీలించిన ఇతర అభ్యర్థులు దీనిపై అభ్యంతరం తెలిపారు. అధికారుల ద్వారా ఈ విషయం జాయింట్ కలెక్టర్ దృష్టికి చేరింది. దీంతో పదో తరగతి విద్యార్హత పత్రాల వాస్తవికతను నిర్ధారించేందుకు వాటిని SSC బోర్డుకు పంపాలని నిర్ణయించారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.