కుటుంబ పెద్దగా తండ్రి బరువు, బాధ్యతలు పేరు పెట్టలేనివి. కుటుంబ పెద్దగా ఉంటాడు కాబట్టే ఆయన్ని ఇంటి యజమాని అంటారు. కుటుంబంలోని వారందరూ తండ్రిపై ఎంతో గౌరవ,భక్తులు చూపిస్తూ ఉంటారు. ఆయన తన బాధ్యతలను మరవకుండా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అలాంటి ఓ తండ్రికి కుమారుడు దారుణమైన అవమానం చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత అమానవీయ పనికి తెరతీశాడు. తండ్రి సమాధిని తవ్వి పుర్రెను బయటకు తీశాడు. ఆ పుర్రెతో ఫొటోలు దిగి స్నేహితులకు పంపాడు. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని రుస్తుంబాదకు చెందిన మురాల జయప్రసాద్ గత సంవత్సరం జులై నెలలో చనిపోయాడు. వారి మత సాంప్రదాయాల ప్రకారం జయప్రసాద్ అంత్యక్రియలు జరిపించారు. ఖననం అనంతరం సమాధి నిర్మించారు. ఈ నెల 9వ తేదీన జయప్రసాద్ మొదటి భార్య కొడుకు సుజయ్ ఓ దారుణమైన పని చేశాడు. తండ్రి మీద ఏం పగపెట్టుకున్నాడో తెలియదు కానీ, ఏ కుమారుడు చేయని పని చేశాడు. తండ్రి సమాధి దగ్గరకు వెళ్లాడు. ఆ సమాధిని తవ్వి తండ్రి పుర్రెను బయటకు తీశాడు. దానితో ఫొటో తీసి స్నేహితులకు పంపించాడు.
దీంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి సమాధి ధ్వంసం అయిన విషయం జయప్రసాద్ రెండో భార్య కుమారుడు సంజయ్‌కి తెలిసింది. దీంతో అతడు ఆవేదన చెందాడు. పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశాడు. సంజయ్ తమను అవమాన పరిచటమే కాకుండా.. మానసికంగా బాధించే విధంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతడి నుంచి తమకు ప్రాణ హాని ఉందని కూడా తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుజయ్ ఎందుకిలా తండ్రి పుర్రెను సమాధినుంచి బయటకు తీశాడన్న దానిపై విచారణ చేస్తున్నారు. మరి, తండ్రి సమాధిని తవ్వి శవ పేటికలోని పుర్రెను బయటకు తీసిన సుజయ్ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.