ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు దానికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. తాజాగా మంత్రి రోజా మెగాస్టార్ చిరంజీవి- పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రోజా విమర్శలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. గెటప్ శ్రీను సైతం ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాడు. ఇప్పుడు మహాసేన రాజేష్ రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.
చిరంజీవి- పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను మహాసేన రాజేష్ తీవ్రంగా ఖండించారు. మంత్రి రోజా మతి ఉండే ఈ వ్యాఖ్యలు చేశారా అని తిరిగి ప్రశ్నించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని మీడియా ముందు వల్లే వేయడం మానేయాలంటూ హితవు పలికారు. అసలు అలాంటి విమర్శలు చేయడానికి నోరెలా వచ్చిందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ హవా ఉన్న రోజుల్లో 18 ఎమ్మెల్యే సీట్లు, 90 లక్షలకు పైగా ఓట్లు సాధించిన ఘనత చిరంజీవిదని గుర్తు చేశారు. కేవలం సినిమా చెరిష్మాతోనే మెగాస్టార్ అంత గొప్ప ప్రజాదరణ సొంతం చేసుకున్నారని చెప్పారు.
ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని వ్యక్తులు పవన్ కల్యాణ్ మనసులేని వ్యక్తని కామెంట్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. 1990ల సమయం నుంచి పవన్ కల్యాణ్ చేసిన దానాలు, ఇచ్చిన విరాళాలు, చేసిన సాయాలను వరుసగా చదువుకొచ్చారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని మనసులేని వాడు, తోటి ఆర్టిస్టు అయ్యారని బాధ పడటాన్ని ఖండించారు. ఇలాంటి అబద్ధాలు కాకుండా నిజాలను ప్రజలకు చెప్పండి. రెండు చోట్ల ఓడిపోయారనే వ్యాఖ్యలకు కూడా సమాధానం చెప్పారు.
ఎలాంటి పదవీకాంక్ష, రాజకీయ ఆపేక్షలు లేవు కాబట్టే దేశవ్యాప్తంగా ఇలా విరాళాలు ఇచ్చుకుంటూ వెళ్తన్నారు. అదే తాను పోటీ చేసే నియోజకవర్గంలోనే ఈ డబ్బంతా ఖర్చుపెట్టి గెలిచి తర్వాత మూడింతలు వసూలు చేయాలి అనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అలాంటి ఆపేక్ష లేదు కాబట్టే పవన్ కల్యాణ్ రెండుచోట్ల ఓడిపోయారంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంత్రి రోజా వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.