శోభనం రాత్రి స్పెషల్ స్వీటు – మాడుగుల హల్వా!..

ఎక్కడో ఉత్తరాంధ్రజిల్లా మారుమూల గ్రామం మాడుగుల. అయితే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది. అదీ ఓ స్వీట్ తయారీ వల్ల. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే మిఠాయి హల్వాకు అంత గుర్తింపొచ్చింది. 1890లో ఒక మిఠాయి వ్యాపారి దీనిని తయారు చేశారు. ఇప్పుడు అమెరికా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, అస్ట్రేలియా., ఇలా 20 దేశాల ప్రజలకు మాడుగుల హల్వా రుచి తెలుసు. మాడుగుల నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్లు ఈ హల్వాను తీసుకెళ్లడంతో విదేశాల్లో సైతం మాడుగుల హల్వా ఫేమస్ అయ్యింది. మాడుగుల హల్వాను తినడం వల్ల లైంగిక సామర్ధ్యం పెరుగుతుందన్న నమ్మకంతోనూ దీన్ని చాలా మంది కొంటుంటారు. ఉత్తరాంధ్రలో ఎవరింట్లో శోభనం జరిగినా ఆ దంపతుల ముందు ఉండే స్వీట్లలో మాడుగుల హల్వా తప్పని సరిగా ఉంటుంది. ఫస్ట్ నైట్ కోసం ఆర్డర్‌లు స్పెషల్‌గా తయారు చేయించుకుంటారు. అలాగే బాలింతలకు శక్తి కోసం కూడా చాలామంది మాడుగుల హల్వాను ఇస్తారు.

మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు సుమారు 140 ఏళ్ల కిందట అదే గ్రామంలో కుటుంబ పోషణకు మిఠాయి వ్యాపారం ప్రారంభించారు. అప్పట్లో ఆయన బూడిద గుమ్మడి, కొబ్బరికాయ, ఖర్బూజాలతో ఈ హల్వా తయారు చేసి అమ్మేవారు. హల్వా వ్యాపారంలో బాగా పోటీ ఉండటంతో మరో కొత్త స్వీట్‌ని తయారు చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ కొత్త స్వీటే… ఇప్పుడు అందరూ లొట్టలు వేసుకుంటూ తింటున్న మాడుగుల హల్వా. మాడుగుల హల్వాని ఓ శతాబ్దం పాటు దంగేటి కుటుంబీకులు మాత్రమే తయారు చేసేవారు. మేలు రకం గోధుమలు మూడు రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీస్తారు. వాటిని ఒక రోజు పులియబెట్టి…ఆవు నెయ్యి, పంచదార కలిపి దగ్గరకు మరిగే వరకు ఇనుప కళాయిలో తిప్పుతారు. ఆ పాకాన్ని దించి వాటిపై ఫ్లేవర్‌ కోసం జీడిపప్పు, బాదం పప్పు వేస్తారు. ఇవన్నీ కూడా పోషక పదార్థాలే. మోతాదుకు మించకుండా తింటే మాడుగుల హల్వా ఆరోగ్యానికి, శారీరక శక్తికి దోహదపడే అవకాశం ఉంది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV