టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా పాత ఆనవాళ్ళు, మూఢాచారాలు మాత్రం మానడంలేదు. ఎక్కడో చోట క్షుద్రపూజలు, చేతబడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేవుడు అంటే ఎంత భక్తి భావం చూపిస్తారో.. దెయ్యం అంటే అంత భయపడతారు. కొంత మంది గ్రామ కూడలిలో మేకను బలి ఇచ్చి, నిమ్మకాయలు వేసి వెళ్లడం లాంటివి చేస్తుంటారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతుంటారు.
ఓ వ్యక్తి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తి చేతబడి కి సంబంధించిన వస్తువులు పెట్టడంతో ఆ కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు. తన కుటుంబాన్ని చంపేందుకు ఇంటి ముందు క్షుద్ర పూజలు చేస్తున్నాడని.. తమను రక్షించాల్సిందిగా ఓ వ్యక్తి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోటవీధికి చెందిన మురళి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కుటుంబాన్ని ఎవరో చంపాలని చూస్తున్నారని.. అందుకు రాత్రి పూట ఇంటి ముందు వివిధ వస్తువులతో క్షుద్ర పూజ చేస్తున్నాడని ఇంటి గడప ముందు కుంకుమ చల్లి వెళ్లాడని ఫిర్యాదు చేశాడు.
తన కుటుంబాన్ని కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు అందుకున్న వెంటనే మున్సిపాలిటీ సిబ్బందితో వాటిని తీసివేయించామని తెలిపారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు.