ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే, వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డుగా ఉంటారని భావించారు. దీంతో దగ్గరిలోని రామాలయానికి వెళ్లారు. అక్కడ హైడ్రామా..
ప్రేమకు కులాలు, మతాలతో పని లేదు. కానీ, ప్రేమ పెళ్లిగా మారాలంటే మటుకు అన్ని అడ్డంకులుగా మారిపోతాయి. దేశంలో కుల,మతాల అడ్డుగోడల కారణంగా ఒక్కటికాలేకపోయిన ప్రేమ జంటలు ఎన్నో ఉన్నాయి. అయితే, కొన్ని ప్రేమ జంటలు వీటన్నింటినీ ఎదురించి ఒక్కటవుతున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రేమ జంట కూడా పెద్దలు తమ ప్రేమను కాదంటారన్న భయంతో గుడిలో ఒక్కటైంది. పెద్దలకు భయపడి కొన్ని గంటల పాటు గుడిలోనే తలుపులు బిగించుకుని ఉండిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, మచిలీపట్నానికి చెందిన గాయత్రి బుద్దాలపాలెంలో గ్రామ సచివాలయ ఉద్యోగిగా పని చేస్తోంది. బుద్దాలపాలెంకు చెందిన నాగరాజు గ్రామంలోని సచివాలయంలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ సెల్‌ఫోన్లలో తరచుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే, ఇద్దరి కులాలు వేరు కావటంతో పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించారు. పెద్దల కారణంగా తమ ప్రేమను బలి చేసుకోవటం వారికి ఇష్టం లేకపోయింది. దీంతో ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరూ బుద్దాలపాలెంలోని కోదండ రాయాలయానికి వెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి అయిపోయిన తర్వాత గాయత్రి, నాగరాజు బయటకు రాలేదు. తమ కుటుంబ పెద్దలనుంచి హామి ఉందంటూ గుడి లోపలే తలుపులు బిగించుకుని ఉండిపోయారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. గుడి దగ్గరకు వెళ్లిన స్థానికులు వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. వారు ఎంత చెప్పినా ఆ జంట వినలేదు. పెద్దల నుంచి హామీ వస్తేనే బయటకు వస్తామని తేల్చి చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రేమ జంటకు నచ్చజెప్పారు. పోలీసుల మాటలతో జంట సోమవారం సాయంత్రం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వారిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.