ఆ మహిళకు ఉన్నట్లుండి ఏదో అయ్యింది.. శరీరరం ఆమె చెప్పిన మాట వినడం లేదు. తిందామని ముద్ద నోట్లో పెడితే.. నాలుక దాన్ని బయటకు తోస్తుంది.. కాళ్లుచేతులు ఆమె ప్రమేయం లేకుండానే కదలసాగాయి. విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్లు.. మహిళకు ఏమైందో అని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎందరు వైద్యులకు చూపించినా.. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. చివరకు మంత్రాలు చేయించారు.. తాయెత్తులు కట్టించారు.. దెయ్యం, గాలి సోకింది ఏమో అని భావించి.. భూత వైద్యులను కూడా ఆశ్రయించారు.
ఆమె ఆరోగ్యం కుదుటపడటం కోసం ఇప్పటికి సుమారు 3 లక్షల రూపాలయు ఖర్చు చేశారు. చివరకు ఓ న్యూరోఫిజీషియన్ డాక్టర్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని.. పరీక్షలు నిర్వహించి.. మహిళ అనారోగ్యానికి గల కారణాలు వివరించారు. సదరు మహిళకు కొరియా అకాంటో సైటోసిస్ అనే అరుదైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. దానికి తగ్గ చికిత్స అందించడంతో.. సదరు మహిళ తిరిగి కోలుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కర్నూలు ఆస్పరికి చెందిన వీరేషమ్మ వయసు 32 సంవత్సరాలు.. కానీ వింత వ్యాధి బారిన పడి 50 ఏళ్ల మహిళగా కనిపిస్తుంది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఆఖరికి భూత వైద్యులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆదోనిలో నిర్వహించిన ఓ మెడికల్ క్యాంప్ కు బాధిత మహిళను తీసుకుని వెళ్లారు. అక్కడ కర్నూలుకు చెందిన న్యూరోఫిజీషియన్ డాక్టర్ హేమంత్‌కుమార్ ని కలిసి.. వీరేషమ్మ పరిస్థితి వివరించారు.
ఈ క్రమంలో మహిళను పరీక్షించిన హేమంత్ కుమార్.. ఆమెను వైద్య పరీక్షల కోసం హోల్ ఎక్సీమ్ సీక్వెన్సింగ్ జెనటిక్ టెస్ట్‌ను అహ్మదాబాద్‌కు పంపించారు. నెలరోజుల స్టడీ అనంతరం వైద్య పరీక్షల నివేదిక డాక్టర్‌కు అందింది. దీనిలో వీరేషమ్మకు ‘కొరియా అకాంటో సైటోసిస్’ అనే అరుదైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. యూపీఎస్ 13ఎ అనే జీన్ మ్యూటేషన్ చెందడంతో ఈ వ్యాధి వస్తుందని డాక్టర్ చెప్పారు.
ఈ వ్యాధి ప్రధానంగా నరాలపై ప్రభావం చూపడం వల్ల రోగికి తెలియకుండానే కాళ్లూ, చేతులు కదులుతూ ఉంటాయని తెలిపారు. ఆహారాన్ని నాలుక తోసేయడం వల్ల సరిగ్గా ఆహారం అందక పోషకాహార లోపం ఏర్పడిందన్నారు. వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాత లక్షణాలను బట్టి ఆమెకు చికిత్స ఇవ్వడం వల్ల సాధారణ స్థితికి వచ్చిందన్నారు. ప్రపంచం మొత్తంగా ఇప్పటి వరకు ఇలాంటి సమస్యతో కేవలం వెయ్యి మంది మాత్రమే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.