ఒకటి కాదు.. రెండు కాదు.. ఇరవై ఏళ్ల తర్వాత కలిగిన సంతానం. అందుకోసం.. మొక్కని దేవుడి లేరు.. తిరగని ఆస్పత్రి లేదు. చివరకు దేవుడు కరుణించి బిడ్డను ప్రసాదించాడు. పది నెలల క్రితమే వారింట సంతానం కలిగింది. ఆ చిన్నారి పుట్టిన నాటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కానీ.. వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కేవలం పది నెలలకే ఊహించని విధంగా చిన్నారి కన్నుమూయడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అది కూడా నూతన సంవత్సరం మొదటి రోజు కావడం మరింత విషాదకరం. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా సి,బెళగల్ మండలం చింతమాను పల్లె గ్రామానికి చెందిన నల్లన్న – సువర్ణ దంపతులకు పది నెలల క్రితం కుమారుడు ఉన్నాడు. ఆదివారం నూతన సంవత్సరం వేడుకల్లో తల్లిదండ్రులు, బంధువులు ఉండగా.. చిన్నారి మెంతో ప్లస్ డబ్బాతో ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటున్న సమయంలో బాబు దాన్ని నోట్లో పెట్టుకోవడంతో.. అది ప్రమాదవశాత్తు గొంతులోకి వెళ్లింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే దాన్ని నోట్లో నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాల సఫలం కాలేదు. దీంతో హాస్పిటల్ కు తీసుకెళ్లేస్తుండగా ఊపిరాడక మార్గమధ్యలోనే మరణించాడు.
అయినా.. బిడ్డ బ్రతుకుతాడేమో అని ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే.. బిడ్డ చనిపోవడం, అది కూడా డబ్బా గొంతులో ఇరుక్కోవడం మూలంగానే మరణించినట్టు వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. లేక.. లేక.. 20 ఏళ్ల తర్వాత పుట్టిన సంతానం కళ్లెదుటే మృతి చెందడంతో వారిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. కావున. చిన్నారులు ఉన్న ఇంట్లో పెద్దవారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వారు చేసే ప్రతి పనిని గమనిస్తుండాలి. ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. అనే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక్కోసారి అమాయకత్వంతో వారు చేసే పనులు ప్రాణాలమీదకు తెస్తాయి.