స్నేహితుడి మొబైల్లో నుంచి అతడి ప్రేయసి నగ్న వీడియోలను సంపాదించాడు. వాటితో ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం గొప్పదని అంటుంటారు. ఏ విషయాన్ని షేర్ చేసుకోవాలన్నా అది మిత్రుల దగ్గరే సాధ్యం. కానీ అలాంటి ఫ్రెండ్షిప్లో గొడవలు వస్తే.. అది ఒకరి ప్రాణానికే ముప్పు తెస్తే ఎలా ఉంటుంది. అవును, ఇలాంటి ఓ ఘటనే కర్నూలులో చోటుచేసుకుంది. ఫోన్లో నుంచి ప్రియురాలి నగ్న వీడియోలు సంపాదించి, వాటితో ఆమెను బ్లాక్మెయిల్ చేసిన ఫ్రెండ్‌ను మరో మిత్రుడితో కలసి చంపేశాడో యువకుడు. కర్నూలులోని బాలాజీనగర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలాజీనగర్‌కు చెందిన ఎరుకలి దినేశ్ డిగ్రీ చదువుతున్నాడు. పూల అలంకరణ పనిచేసే మల్లెపోగు మురళీకృష్ణ (22) అతడికి మిత్రుడు.
దినేశ్ తాను లవ్ చేసిన అమ్మాయి నగ్న వీడియోలను తన మొబైల్లో ఉంచుకున్నాడు. ఆ వీడియోలను మురళీకృష్ణ తన ఫోన్లోకి రహస్యంగా పంపించుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతికి కాల్ చేసి వేధించడం ప్రారంభించాడు. వీడియోలను కుటుంబసభ్యులు, బంధువులకు పంపుతానంటూ ఆమెను బెదిరించేవాడు. వేధింపులు తట్టుకోలేక ఇటీవల ఆ యువతి సూసైడ్‌కు ప్రయత్నించి ఆస్పత్రిలో చేరింది. దీంతో దినేశ్.. మురళీకృష్ణపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడ్ని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. కిరణ్ కుమార్ అనే మరో ఫ్రెండ్‌తో కలసి పథకం రచించాడు.
శివమాల వేసుకున్న మురళీకృష్ణను జనవరి 25న దినేశ్, కిరణ్‌కుమార్‌లు ఓ బైక్ మీద ఎక్కించుకున్నారు. కర్నూలు నగర శివార్లలోని పంచలింగాల ప్రాంతానికి అతడ్ని తీసుకెళ్లారు. అక్కడ మురళీకృష్ణను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఆ తర్వాత ఒక ఆటోను అద్దెకు తీసుకుని మృతదేహాన్ని నన్నూరు టోల్‌ప్లాజా దగ్గర్లోని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో పడేశారు. మృతుడి మొబైల్ ఫోన్, బట్టలను వేర్వేరు చోట్ల పడేసి వెళ్లిపోయారు. మురళీకృష్ణ ఆచూకీ కోసం పలుచోట్ల గాలించిన అతడి పేరెంట్స్.. ఈ నెల 16న కర్నూలు తాలూకా అర్బన్ పోలీసు స్టేషన్లో కంప్లయింట్ చేశారు. దినేశ్‌ను పోలీసులు విచారించగా.. అసలు విషయాన్ని చెప్పేశాడు. మృతదేహం కోసం పోలీసులు హంద్రీ–నీవా కాలువలో గాలిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.