తప్పతాగి.. రోడ్ల మీద హల్చల్ చేసే మందుబాబులను చూస్తే.. చిరాకు కలుగుతుంది. వీళ్లకి ఇదేం పోయే కాలం.. తాగి ఒళ్లుపై మరిచి.. ఒంటి మీద ఏమాత్రం స్పృహ లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ పడిపోయే వారిని చూస్తే.. అసహ్యం కలగక మానదు. ఇక కొందరు మందుబాబులు.. తాగి రోడ్ల మీద హల్చల్ చేస్తారు. అలాంటి వారిని పోలీసులు.. నయనోభయానో బెదిరించి.. వారిని అదుపు చేస్తారు. ఇళ్లకు పంపిస్తారు. మరి ప్రజలను అదుపు చేసే.. పోలీసులే తాగి.. రోడ్ల మీద హల్చల్ చేస్తే.. అప్పుడు వారిని ఎవరు అదుపు చేయాలి.. ఇదిగో ఈ కోవకు చెందిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్, కర్నూల్‌లో చోటు చేసుకుంది. ఏఎస్సై ఒకరు.. తప్పతాగి రోడ్ల మీద హల్చల్ చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. కర్నూలు తాలుకా.. అర్బన్ ఏఎస్సై ఎస్.లక్ష్మీమాధవస్వామి ఇలా తప్ప తాగి రోడ్ల మీద హల్చల్ చేశాడు. తాను ఎక్కడున్నాడు.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో.. అర్థం కాని స్టేజ్‌లో ఉన్నాడు. ఒంటి మీద సోయి లేకుండా.. తూలుతూ.. రోడ్డు పక్కన కునికిపాట్లు పడ్డాడు. ఇక సదరు ఏఎస్సై 1989 బ్యాచ్‌కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. చాలా ఏళ్లుగా ఆయన మద్యానికి బానిస అయ్యాడు. ఈ కారణం చేతనే.. ఆయన రెండు సార్లు.. విధుల నుంచి సస్పెండ్ కూడా అయ్యాడు. అయినా సరే.. తన ప్రవర్తనను మార్చుకోలేదు.
తుగ్గలి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న లక్ష్మీమాధవ.. కొన్ని రోజుల కిందట.. అటాచ్‌మెంట్‌పై కర్నూలు తాలుకా.. అర్బన్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నాడు. ఉదయం విధులకు హాజరైన.. లక్ష్మీమాధవ.. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి.. తిరిగి వెళ్లే క్రమంలో.. యూనిఫాంలోనే.. మందు తాగాడు. తప్ప తాగి పడిపోయే రేంజ్‌లో మద్యం సేవించాడు. ఇక అక్కడ నుంచి వెళ్లడానికి శరీరం సహకరించక.. మత్తులో అక్కడే పడిపోయాడు. వినాయక్ ఘాట్ ప్రాంతంలో.. పడిపోవడతో.. అతడిని గమనించిన స్థానికులు.. ఫుట్‌పాత్‌పై పడుకోబెట్టి వెళ్లారు.
విషయం తెలిసిన కర్నూలు మూడో పట్టణ పోలీసులు.. ఆయన్ను ఆటో ఎక్కించి ఇంటికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో.. ఇది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. క్రమశిక్షణ ఉల్లంఘన కింద లక్ష్మీమాధవపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాజాన్ని మంచి మార్గంలో నడపాల్సిన పోలీసులు ఇలా తప్పతాగి రోడ్ల మీద పడిపోవడం చూస్తే.. మీకేమనిపిస్తుందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.