కృష్ణ జిల్లా- మాతృత్వం స్త్రీకి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. పెళ్లైన ప్రతి మహిళ తల్లి కావాలని ఆశిస్తుంది. దురదృష్టం కొద్ది కొందరికి పిల్లలు కలగరు. ఇక అలాంటి వారు అనుభవించే బాధ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఓ మహిళ చేసిన పని చూస్తే నిజంగా సాహసమనే చెప్పవచ్చు. సూటిపోటి మాటలు తప్పించుకోవడం కోసం ఏకంగా తొమ్మిది నెలల పాటు గర్భవతిగా నటించింది. కాన్పు సమయం దగ్గర పడుతుండటంతో… ఏం చేయాలో పాలుపోక.. పురిటి కందును ఎవరో ఎత్తుకెళ్లారని చెప్పింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయట పడటంతో అందరూ షాక్ అయ్యారు. ఈ సంఘటన ఏపీ, కృష్ణా జిల్లా కొండపల్లిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు…
కృష్ణ జిల్లా, కొండపల్లికి చెందిన మహిళకు.. తెలంగాణ, ఖమ్మం జిల్లా వైరాకు చెందిన వ్యక్తితో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఏళ్లు గడుస్తున్నా.. పిల్లలు మాత్రం కలగలేదు. ఈ విషయమై అత్తింటివారు, బంధువుల సూటిపోటి మాటలతో మహిళను బాధపెట్టసాగారు. ఈ బాధ తట్టుకోలేకపోయిన మహిళ.. తాను గర్భవతనని చెప్పి.. తొమ్మిది నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. నెలలు గడుస్తున్న కొద్ది.. పొట్ట చుట్టూ వస్త్రాలు చుట్టుకుని, ఆస్పత్రికి వెళ్లి వస్తూ.. ఇంట్లో వారిని నమ్మించసాగింది.ఇక జనవరి 5న తన ప్రసవానికి వైద్యులు డేట్ ఇచ్చారని అందరికీ చెప్పింది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి తనకు నొప్పులు వచ్చాయని.. ఇద్దరు వ్యక్తులు తనకు ప్రసవం చేశారని.. అనంతరం పురిటి బిడ్డను ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు మహిళ మీద అనుమానం రావడంతో.. ఆమెను వైద్య పరీక్షల నిమిత్త.. విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మహిళకు పరీక్షలు చేసిన.. వైద్యులు ఆమె అసలు గర్భవతి కాదని.. అంతా నాటకమని తేల్చారు. పోలీసులు దీని గురించి సదరు మహిళను ప్రశ్నించిగా.. అసలు విషయాన్ని తెలిపింది. ఆమె మాటలు విన్న కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.