ఫైర్ బ్రాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్‌లా నిలిచారు కొడాలి నాని. విపక్షాలపై దూకుడుగా వ్యవహరించడంలో.. ఘాటుగా విమర్శలు చేయడంలో నాని తర్వాతే ఎవరైనా. అయితే మాటలతోనే కాక.. చేతలతో కూడా వార్తల్లో నిలుస్తారు కొడాలి నాని. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. తమ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ని ఎవరు ఒక్క మాట అన్నా సహించరు. ప్రతిపక్షాలపై మాటల యుద్ధం చేయడంలో.. వాడివేడిగా విమర్శలు చేసే నేతల్లో ముందు వరుసలో ఉంటారు కొడాలి నాని. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా నాని పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బస్సు డ్రైవర్ అవతారం ఎత్తారు. గుడివాడ బస్టాండ్‌లో నూతనంగా ప్రారంభించిన బస్సులను.. పట్టణంలో మెయిన్ రోడ్డు మీద తిప్పారు నాని. కృష్ణా జిల్లాలోని గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో పల్లె వెలుగు బస్సులను ప్రారంభించారు కొడాలి. ఈ సందర్భంగా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులో పల్లె వెలుగు బస్సును స్వయంగా నడుపుతూ సందడి చేశారు కొడాలి నాని. ఇక నూతనంగా ప్రారంభించిన ఈ పల్లె వెలుగు బస్సు సర్వీసులు గుడివాడ నుండి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్నాయి. ఈ బస్సులు ఎస్.ఎం.ఈ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద మంజూరయ్యాయి. స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరులు తీసుకున్న బస్సులను తాను ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు కొడాలి నాని.
రాష్ట్రంలోని దళితులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనేది తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి లక్ష్యమన్నారు కొడాలి నాని. ఆర్టీసీ ఈ ఐదు బస్సులను కొత్తగా లీజుకు తీసుకుంది. ఎంఎస్ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సబ్సిడీతో ఒక్కొక్కరికి రూ.50 లక్షల యూనిట్ విలువతో ఐదు బస్సులను ఎస్సీలకు మంజూరు చేశాయి. లబ్ధిదారులు పొందిన ఈ నూతన బస్సులను ఆర్టీసీ లీజుకు తీసుకోగా.. కొడాలి నాని వీటిని ప్రారంభించి.. బస్టాండ్ నుండి నెహ్రూచాక్ వరకు బస్సు నడిపి ప్రయాణికులను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. మరి దళితులకు ప్రభుత్వం నుంచి అందిన ఈ సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.