గత కొంత కాలంగా ఏపి క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లు ప్రకటించగా.. ఆ మార్పుల అనంతరం కొందరు తాజా మాజీల్లోనూ, పలువురు ఆశావహుల్లోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. కొత్త కేబినెట్‌లో తమ అభిమాన నేతలకు చోటు దక్కలేదని ఆక్రోశంతో పలుచోట్ల ఆందోళన చేపట్టారు వైసీపీ కార్యకర్తలు. కొన్ని చోట్ల ఓ అడుగు ముందుకు వేసి ఆత్మహత్య యత్నాలు కూడా చేస్తున్నారు. అసలే ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతన్న సందర్భంలో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరి ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంపై సర్వత్రా చర్చ నడుస్తుంది.
ఏపి కేబినెట్లో చేసిన మార్పులు విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆమెను బుజ్జగించే పనిలో సీనియర్ నేతలు ఉన్నారు. కొత్త కేబినెట్ లో సీటు దక్కుతుందని ఎప్పటి నుంచి కలలు కంటున్న వారికి తీవ్ర నిరాశ మిగిలింది. మరికొంత మంది కీలక నేతలు రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు దక్కని వారు అసహనానికి గురి కావొద్దని.. సీఎం జగన్ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అందరం కట్టుబడి ఉంటారు. దయచేసి ఎవరూ ఏడుపులు, శోకాలు పెట్టొద్దు అన్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ తప్పకుండా న్యాయం చేస్తారని.. పార్టీ కోసం కట్టుబడి ఉండాలని.. జగన్ వెనుక సైనికుల్లా నిలబడాలని అన్నారు. ఎవరూ అసంతృప్తి చెద్దవొద్దని హితవు పలికారు.