వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగార నిర్వహణకు మూలధనం/ముడి సరుకుల కోసం నిధులు ఇచ్చి నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదన బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుంది. సింగరేణి తరపున లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ ఈ బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనల కోసం విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ నుంచి అధికారుల బృందం ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళ్లనుంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సేకరించాలనుకుంటున్న నిధులు ఎన్ని, నిబంధనలు, షరతులు ఏమిటన్న వాటిపై కూలంకషంగా అధ్యయనం చేయనున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, అదే సమయంలో తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటీవల మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడం కోసం ఆర్ఐఎన్ఎల్ ద్వారా కేంద్రం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనను తీసుకొచ్చిందని అన్నారు.
ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదన నెపంతో బీజేపీకి చెందిన ప్రైవేటు వ్యక్తుల చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న మార్గాలను కేసీఆర్ కు వివరించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు కావాల్సిన స్టీల్ ను నేరుగా కొనుగోలు చేయాలని, స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని సూచించారు. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బీఆర్ఎస్ అధికారులు వెళ్లనున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ యాజమాన్యం మార్చి 27న ఒక ప్రకటన చేసింది. బొగ్గు, నేల బొగ్గు, ఇనుము వంటి ముడి పదార్థాలను సరఫరా చేయడంతో పాటు నిబంధనల మేరకు పరస్పర అంగీకారంతో ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ లో పేర్కొంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 3 గంటల్లోగా సమర్పించాలని యాజమాన్యం సూచించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ స్టీల్ ప్లాంట్ బిడ్డింగులో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగులో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.