అంతవరకు ఎంతో సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏదో శాపం తగిలినట్లు ఓ వింత వ్యాధి ఆ కుటుంబాన్ని ఆవరించింది. నెల రోజుల వ్యవధిలో ముగ్గుర్ని బలితీసుకుంది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన వేముల శ్రీకాంత్‌ది అందమైన కుటుంబం. భార్య మమత, కూతురు అమూల్య, కుమారుడు అద్వైత్‌తో చిన్న కుటుంబం చింత లేని కుటుంబంలా వాగు ఒడ్డున ఉన్న ఇంట్లో హాయిగా జీవించేవాడు. ఇలా చింత లేకుండా ఎంతో సంతోషంగా ఉన్న వీరి కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ, ఒక్కసారిగా ఆ కుటుంబంలో అలజడి మొదలైంది.
కొద్దిరోజుల క్రితం అద్వైత్ విరోచనాలు, వాంతుల బారిన పడ్డాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాదం నుంచి తేరుకోకుండానే కూతురు అమూల్య కూడా అనారోగ్యం బారిన పడింది. అద్వైత్ లాగే వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప కన్నుమూసింది. నెల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలు చనిపోవటంతో కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్, మమత కన్నీరు మున్నీరుగా విలపించారు. కూతురి కర్మకాండలు పూర్తయిన ఆ వెంటనే ఆ వింత వ్యాధి శ్రీకాంత్ భార్యను చుట్టుముట్టింది. మమతకు వాంతులు, విరోచనాలు అయ్యాయి.
దీంతో శ్రీకాంత్ ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయింది. ఇలా నెల రోజుల వ్యవధిలో ముగ్గురు కుటుంబసభ్యులు చనిపోవటంతో శ్రీకాంత్ ఆవేదనకు అంతులేకుండా పోయింది. తమ వారిని బలి తీసుకున్న వ్యాధి ఏంటో అర్థంకాక తల్లడిల్లిపోతున్నాడు. ఈ ముగ్గురి మృతితో గంగాధర గ్రామంలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్యాధికారులు వాంతులు, విరేచనాలకు కారణం ఏంటో అన్వేషించే పనిలో పడ్డారు. మరి, నెల రోజుల వ్యవధిలో ముగ్గుర్ని బలితీసుకున్న ఆ వింత వ్యాధిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.