ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి విదితమే. తాజాగా మరో మలుపు తీసుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు, అరెస్టుల పర్వం చోటుచేసుకుంటున్నాయి. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి విదితమే. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్‌ని అదుపులోకి తీసుకొంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం ఉదయం పులివెందులలో ఆయనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వివేకా హత్యకేసులో ఆరుగురు ప్రధాన నిందితుల్లో భాస్కర్ రెడ్డి ఒకరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డితో పాటు ఎంపీ పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వీరిని కడపకు తరలించారు. భాస్కర్ రెడ్డి అరెస్టు క్రమంలో ఆయన ఇంటికి పెద్దసంఖ్యలో చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు సీబీఐ అధికారులను అడ్డుకున్నారు. స్వల్ప ఉద్రిక్తత నడుమ ఆయనను అక్కడి నుంచి వారిని తీసుకెళ్లారు. కాగా, సెక్షన్ 130 బీ, రెడ్ విత్ 302, 201 కింద కేసు నమోదుచేసిన సీబీఐ.. భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయన సతీమణికి సమాచారం ఇచ్చారు.
ఇక హైదరాబాద్‌లో ఉన్న అవినాశ్ రెడ్డి నివాసానికి కూడా సీబీఐ అధికారులు చేరుకున్నట్లు సమాచారం. ఈ హత్య కేసులో అవినాశ్‌ను అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. వివేక హత్యకు ముందు భాస్కర్ రెడ్డి నివాసంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. తొలుత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఈ కేసు సీబీఐకు చేరింది. ఈ నాలుగేళ్లలో ఈ హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది.