ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటలు కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి.. ఎంతో కష్టపడితే కానీ సర్కార్ కొలువు సాధించలేం. అన్ని బాగుండి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా.. ఆఫర్ లేటర్ అందుకునే వరకు ఎన్నో వివాదాలు. ఇలా 1998 లో నిర్వహించిన డీఎస్సీ కూడా ఇలానే వివాదాస్పదం కాగా.. తాజాగా ఆ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తోంది ప్రభుత్వం. ఆ వివరాలు..
ప్రభుత్వ ఉద్యోగం అంటే యువతకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏళ్ల తరబడి కష్టపడి, పగలు, రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తూ.. కన్నవాళ్లకు, సొంత ఊరికి దూరంగా ఉంటూ.. ఉద్యోగం వస్తుందా రాదా అనే ఆలోచనలతో సతమతమవుతూ.. ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అభ్యర్థులు. అయితే మనం ఎంత కష్టపడినా సరే.. ఆవగింజంత అదృష్టం లేకపోతే.. సర్కారీ కొలువు రావడం అనేది కల్ల. అంత కష్టపడి సాధించిన కొలువులో చేరడానికి ఏళ్లకు ఏళ్లు సమయం పడితే.. ఆ అభ్యర్థుల ఆవేదన వర్ణించడానికి మాటలు చాలవు. అసలు ఉద్యోగం వస్తుందో, రాదో తెలియక.. ప్రభుత్వ ఉద్యోగం మీద ఆశ వదిలేసుకోలేక.. మరో పనిలో చేరలేక.. వారు పడే ఆవేదనను ఎంత వర్ణించినా తక్కువే.
ఉమ్మడి ఏపీలో 1998 డీఎస్సీ అభ్యర్థులు ఇలాంటి బాధలే అనుభవించారు. ఆ ఏడాది క్వాలిఫై అయినా సరే.. రిక్రూట్‌మెంట్ వివాదం కోర్టుకు చేరడంతో.. అభ్యర్థుల ఎంపిక నిలిచిపోయింది. ఏళ్లు గడిచినా ప్రయోజనం లేకుండా పోయింది. కానీ తాజాగా సీఎం జగన్ నిర్ణయంతో అభ్యర్థులకు నియామక పత్రాలు అందుతున్నాయి. దీనిలో భాగంగా జబర్దస్త్ నటుడు ఒకరు టీచర్ కొలువు పొందగా.. తాజాగా ఈ జాబితాలోకి మరో వ్యక్తి చేరాడు. ఆ వివరాలు..
కడప జిల్లాకు చెందిన రాజకీయ నేత ఒకరికి తాజాగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. చదువుకునే రోజుల నుంచే ఆయన టీచర్ కావాలని కలలు కన్నాడు. ఈ క్రమంలోనే పరీక్ష కూడా రాశాడు. క్వాలిఫై అయ్యాడు. కానీ వివాదాల కారణంగా 1998 డీఎస్సీ ఫలితం ఎటూ తేలకుండా పోయింది. ఇక తాజాగా సీఎం జగన్ చొరవ కారణంగా 1998 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావుకు డీఎస్సీ-98లో ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం తనను ఉద్యోగంలో నియమిస్తూ ఆదేశాలిచ్చిందని వెల్లడించారు. తాను కలలు కన్న ఉద్యోగం రావడంతో.. అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుకు తన రాజీనామా లేఖను పంపించాడు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘టీచర్ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అప్పట్లో కష్టపడి డీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. కానీ ఆ ఫలితం కాస్త కోర్టుకు చేరడంతో.. ఇతర పనులు చేసుకుంటూ ఉన్నాను. ఈ క్రమంలోనే రాజకీయాల్లో చేరాను. ఇక తాజాగా డీఎస్సీ-98 వివాదాలు తొలిగి పోయి.. నాకు ఉద్యోగం వచ్చింది. కడప జిల్లా సిద్ధవటం మండలం దిగువపేట స్కూల్‌లో టీచర్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. నాకు టీచర్ కొలువు వచ్చిన విషయాన్ని పార్టీ పెద్దలకు ఫోన్ ద్వారా తెలిపాను. అలానే రాజీనామా విషయాన్ని కూడా తెలియజేశాను’’ అని చెప్పుకొచ్చారు.
ఈ జాబితాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. ఆయనకి కూడా 1998 డీఎస్సీలో ఇప్పడు ఉద్యోగం వచ్చింది. గతంలో ఉన్న కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అప్పుడు క్వాలిఫై అయిన వారందరికి ఇప్పుడు ఉద్యోగాలు దక్కాయి. ధర్మశ్రీ రాజకీయాల్లోకి రాకముందు.. దాదాపు పాతికేళ్ల క్రితం డీఎస్సీ రాసి అర్హత సాధించారు. కానీ కోర్టు వివాదాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ధర్మ శ్రీ రాజకీయాల్లో చేరి బిజీ అయ్యారు. అయితే తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని.. టీచర్ ఉద్యోగంలో చేరనని తెలిపారు ధర్మశ్రీ.