కేఏ పాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. ప్రజాశాంతి పార్టీ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తానంటూ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై ఎమ్మార్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం పద్మావతి మహిళా వర్సిటీలోకి అనుమతి లేకుండా ప్రవేశించడమే అందుకు కారణంగా చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో తన కార్లతో కేఏ పాల్ మహిళా యూనివర్సిటీలోకి ప్రవేశించారు. అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేసిన సెక్యూరిటీని గద్దించి మరీ లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత విద్యార్థినులను పిలిచి వారితో మాట్లాడారు. అక్కడితో ఆగకుండా వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయించి వారితో కూడా మాట్లాడారు.
అనుమతి లేకుండా ప్రవేశించారంటూ వర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అదించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేఏ పాల్ కార్లను వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసు స్టేషన్ కు రావాలంటూ చెప్పారు. కేఏ పాల్ అందుకు నిరాకరించి కారులోనే కూర్చున్నారు. కాసేపటికి కేఏ పాల్ ను అక్కడి నుంచి పంపేశారు. అనుమతి లేకుండా ప్రవేశించినందుకు ఏకే పాల్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు ముందు తిరుపతిలో కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ప్రభంజనం ఖాయమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి తీరుతామన్నారు. తెలంగాణకు తాను ముఖ్యమంత్రి అవుతానని.. ఏపీలో ఓ మహిళను సీఎంని చేస్తానంటూ పాల్ వ్యాఖ్యానించారు. కేఏ పాల్ పై కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.