మనకు శుభకార్యం అనగానే గుర్తుకు వచ్చేది.. అరటి చెట్టు, దాని ఆకులు, పండ్లు. అయితే సాధారణంగా మనం చూసే అరటి చెట్లుకు గెలలు మూడు నుంచి ఐదు అడుగుల వరకు పెరుగుతుంటాయి. మహా అయితే ఇంకొంచె అదనంగా పెరగొచ్చు. వాటికి కూడా పరిమిత సంఖ్యలోనే కాపు వస్తుంది. కానీ ఓ రకం అరటి చెట్టు గెలలు మాత్రం ఏకంగా ఏడు అడుగులు ఉండి.. దాదాపు 600 వరకు అరటి పండ్లు కలిగి ఉంది. ఈ రకం అరటి చెట్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. మరి ఆ జంబో అరటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లోని పెరట్లో అమృతవాణి రకానికి చెందిన అరటి చెట్ల గెలలు దాదాపు ఏడు అడుగులు ఉన్నాయి. 37 హస్తాలు, సుమారు 600 కాయలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. పొడువుగా నిలబెట్టి ఇద్దరు మనుషులు పట్టుకున్నా మోయలేనంత పెద్దదిగా ఈ అరటి గెల ఉంది. ఈ గెలలు చూడటానికి ఓ అనకొండలాగా కనిపిస్తున్నాయి. గెలల చుట్టూ అరటి కాయలు విరగ పండినాయి. ఒక్కొక్క సారి ఆ గెలల బరువు తట్టుకోలేక అరటి చెట్లు విరిగిపోతున్నాయి. అయితే స్థానికంగా ఎక్కడ ఇలాంటి రకం అరటి ఎవరూ చూడక పోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతేడాది బెంగళూరులో ఉంటున్న తన కుమార్తె ఇంటి నుండి ఈ రకం అరటి మొలక తెచ్చినట్లు సుదర్శన్ తెలిపారు. ఈ అరటి చెట్లు మరో రెండు కూడా బాగా కాపు మీద ఉన్నాయని అన్నారు. ఈ అరటి గెలలను చూసేందు స్థానిక జనం ఆసక్తి గా సుదర్శన్ ఇంటికి వస్తున్నారు. ఈ అరటి గెలలతో ఫోటోలు, సెల్ఫీలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ జంబో అరటి గెలలపై ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.