గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎన్టీఆర్ పేరు షేక్ చేస్తోంది. వైఎస్ఆర్ పేరుతో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంతో అసలు రచ్చ మొదలయింది. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చలు, వాదనలు వినిపిస్తున్నా.. ఇప్పుడు ఈ విషయంలోకి జూనియర్ ఎన్టీఆర్ పేరును లాగుతున్నారు. అందుకు కారణం.. యూనివర్సిటీ పేరు మార్చడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన విధానం.
విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్న వర్సిటీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంతో.. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. అలాగే యూనివర్సిటీకి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
ఇప్పుడు యూనివర్సిటీకి పేరు మార్చిన విషయమై జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయిన విధానంపై టీడీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెడితే ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్.. ఇలా పైపైనే స్పందిస్తే ఎలా? ఆ ప్రతిఘటన ఏదో తారాస్థాయిలో ఉండాల్సిన అవసరం లేదా? అన్నది టీడీపీ కార్యకర్తల ప్రశ్న. వీరి ఆవేశంలో, ఆందోళనలో అర్ధం లేకపోలేదు. కానీ.. టీడీపీని, చంద్రబాబుని నమ్మి ఎన్టీఆర్ నిజంగా జగన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయగలడా? గతంలో టీడీపీ కోసం చావు అంచుల వరకు వెళ్లి ప్రచారం చేసినా.. తర్వాత పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కి దక్కింది ఏమిటి?
అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరైనా ఎన్టీఆర్ ని పట్టించుకున్నారా? అలాంటి పార్టీ కోసం, మనుషుల కోసం మా హీరో రాజకీయ రంగు ఎందుకు పులుముకోవాలి?అన్నది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ప్రశ్న. సీనియర్ ఎన్టీఆర్ అంటే.. తారక్ కి విపరీతమైన గౌరవం. అంతకుమించిన ప్రేమ. ఆ ప్రేమ ఉంది కాబట్టే.. కుటుంబ సభ్యుల్లో అందరికన్నా ముందుగా స్పందించాడు. పేర్లు మార్చినంత మాత్రాన ఆ పెద్దాయన స్థాయిని ఎవ్వరూ తగ్గించలేరని చెప్పుకొచ్చాడు. ఇక అంతకుమించి ఏమి కావాలి? చంద్రబాబు కోసం సీఎం జగన్ ని తిట్టాలా? మరోసారి బాబు ఆడే ఆటలో మా హీరో పావు కావాలా? అని తారక్ ఫ్యాన్స్ తమ హీరోకి మద్దతుగా నిలుస్తున్నారు.
ఇలా టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తే.. తారక్ ఫ్యాన్స్ మాత్రం ఒకే ఒక వీడియోతో చంద్రబాబుకి రిటర్న్ కౌంటర్ సిద్ధం చేశారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన “యమదొంగ” సినిమాలో ఒక సన్నివేశాన్ని ఇందుకు వాడుకుంటున్నారు. “పోయిన సారైతే ఎవరో గొట్టం గాడు వెనుక నుండి వెన్నుపోటు పొడవడం వల్ల ఇక్కడ వచ్చి పడ్డా. ఈసారి నాకు అంతా తెలుసు కాబట్టి రావాలి అనుకున్నప్పుడే వస్తా” అంటూ అందులో తారక్ డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగ్స్ చంద్రబాబుకి కౌంటరే అంటూ ఫ్యాన్స్ ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. గతంలో కూడా తారక్ సీఎం సీఎం అంటూ అరుస్తూ ఫ్యాన్స్.. బాబుని బాగానే ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈ వీడియోని చంద్రబాబుకి ఆపాదించి తమ హీరోకి మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.