ఏపీలో రాజకీయాలు వెేడెక్కాయి. తాజాగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ తనకు రూ.10 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించిందనడమే కాకుండా.. తాను దొంగ ఓట్లు వేస్తే గెలిచానంటూ వ్యాఖ్యానించారు.
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఎందుకంటే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ ని పెంచాయి. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ఈ ఎమ్మెల్యే ఆ తర్వాత క్రమంగా వైసీపీకి మద్దతు తెలుపుతూ వచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తర్వాత రాపాక చేసిన కొన్ని పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి. ఓటు వేస్తే రూ.10 కోట్లు ఇస్తామంటూ తనకు ఆఫర్ వచ్చిందని చెప్పిన రాపాక ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతోంది.
రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన దగ్గరి నుంచి రాపాక వరప్రసాద్ పేరు అడపాదడపా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల ఆయన చేసిన కొన్ని పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేస్తే టీడీపీ తనకు రూ.10 కోట్లు ఇస్తానంటూ ఆఫర్ చేసిందని రాపాక వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కానీ, వాళ్లు ఇచ్చిన ఆఫర్ కు తలొగ్గలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. తాను రెండుసార్లు ఎలా గెలిచారు అనే సీక్రెట్ స్వయంగా రవీల్ చేశారు. దొంగ ఓట్ల సాయంతోనే తాను గెలిచినట్లు వెల్లడించారు.
తనవాళ్లు ఒక్కొక్కరు పదేసి చొప్పున ఓట్లు వేయబట్టే తాను విజయం సాధించినట్లు.. ఇటీవల పాల్గొన్న ఒక ఆత్మీయ సమ్మేళనంలో రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే చేటు తెచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాపాక చేతిలో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు. అందుకే ఎమ్మెల్యే రాపాక అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఆయన సోమవారం మధ్యాహ్నం సఖినేటిపల్లిలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఆయన రాకపోవడం, ఫోన్ స్విచ్ రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లారంటూ చెబుతున్నారు. ఎమ్మెల్యే లేక కార్యక్రమాన్ని కూడా అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎమ్మెల్యే రాపాకపై ఈసీ చర్యలు తీసుకుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.