ఏపీలో జగన్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధిదారులకు అకౌంట్లో డబ్బులు జమకానున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు డబ్బులు విడుదల చేయనున్నారు. ఈ రోజు తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ. 1.25 కోట్ల వరకు, ఇతరులకు రూ. కోటి వరకు 100% ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందిస్తోంది. ఈ ఇన్‌స్టాల్‌మెంట్‌లో అర్హులైన 357 మంది స్టూడెంట్స్‌కి రూ. 45.53 కోట్లు అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
జగన్ ప్రభుత్వం అర్హులైన విద్యార్థుందరికీ పూర్తి ఫీజులు చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఈ డబ్బులు అందజేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన విద్యార్థులకు పారదర్శకంగా నగదు నేరుగా వారి అకౌంట్లలోకి చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గత 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కింద జగన్ ప్రభుత్వం రూ. 65.48 కోట్లు ఆర్థిక సాయం అందించింది.
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్ ప్రకారం ఎంపిక చేసిన 21 కోర్సుల్లో అగ్రగామిగా ఉన్న 50 యూనివర్సిటీలకు ఎంపికైన స్టూడెంట్స్‌కు ఈ పథకం వర్తిస్తుంది. కోర్సు పూర్తి చేసుకునేలా నాలుగు విడతల్లో స్కాలర్‌షిప్స్ మంజూరు చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ కార్డ్ పొందిన తర్వాత మొదటి వాయిదా, ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ తర్వాత రెండవ విడత, సెకెండ్ సెమిస్టర్ తర్వాత 3వ విడత, 4వ సెమిస్టర్ పూర్తి అయ్యాక మార్క్స్ షీట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ అయిన తర్వాత చివరి విడత చెల్లిస్తారు.
కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచడంతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతోంది. ఈ స్కీం యొక్క వివరాలు https://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. గతంలో కుటుంబ సంవత్సర ఆదాయ పరిమితి రూ. 6 లక్షల్లోపు ఉండగా.. ప్రస్తుతం ఆ పరిమితిని ప్రభుత్వం పెంచింది. వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్నవారు కూడా అర్హులుగానే జగన్ సర్కార్ ప్రకటించింది.