ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా సానుకూల వైఖరితో వ్యవహరిస్తోంది ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఉద్యోగుల సమస్యలను విని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుంది. తాజాగా మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలు చేయడంలోనే కాదూ.. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా సానుకూల వైఖరితో వ్యవహరిస్తోంది. ఉద్యోగుల సమస్యలను విని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను అందిస్తామని పేర్కొన్న జగన్ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేసింది. అలాగే ప్రభుత్వ మహిళా ఉద్యోగులు తమ 180 రోజుల చైల్డ్ కేర్ సెలవులను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా వాడుకోవచ్చని జగన్ సర్కార్ తెలిపింది. ఇప్పుడు మరోసారి మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దీంతో ఆ ఉద్యోగులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామి రెడ్డి తెలిపారు. మహిళల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు మాత్రమే 5 ప్రత్యేక సాధారణ సెలవులు గతంలో మంజూరు చేసింది. అయితే, ఈ సౌకర్యం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం లేదు. కానీ, ఇప్పుడు వారికి గుడ్‌న్యూస్ చెప్పింది సర్కార్. ఈ సౌకర్యాన్ని ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు కూడా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేయడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.
మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంవత్సరానికి 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేయడానికి అంగీకరించారని వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 39 తేదీ. 11-04-2023 ద్వారా ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌కు.. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.