జగతి పబ్లికేషన్స్ (సాక్షి)కి సంబంధించిన క్విడ్ ప్రో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాక్షి పెట్టుబడుల్లో క్రిడ్ ప్రో ఆరోపణల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఇన్వెస్టర్లకు భారీ ఊరట లభించింది. ఈ విషయంలో సాక్షి వాదనలకు అనుకూలంగా ఐటీ అప్పీలెట్ ట్రైబ్యునల్ తీర్పు వెల్లడించింది. ఐటీ అప్పీలెట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులో సాక్షిలో పెట్టుబడలను క్విడ్ ప్రోగా చూడలేమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో జగన్ పై ఉన్న మిగతా కేసుల్లో కూడా ఈ తీర్పు కీలకం కానున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.
2007-08 కాలంలో రూ. 350 చొప్పున ప్రీమియంతో పలువురు పారిశ్రామికవేత్తలకు షేర్లు విక్రయించి.. జగతి పబ్లికేషన్ (సాక్షి) 292 కోట్ల రూపాయలు సమీకరించింది. ఈ క్రమంలో సాక్షిలో ఇతర కంపెనీల పెట్టుబడులను క్విడ్ ప్రో కోగా పరిగణిస్తూ.. ఆదాయశాఖ పన్ను యాక్ట్ లోని 56, 58 సెక్షన్ల ఆధారంగా షేర్ ప్రిమీయం రూ. 292 కోట్లపై అప్పట్లో ఆదాయపన్ను శాఖ పన్ను వేసింది.
ఈ క్రమంలో జగతి పబ్లికేషన్ ఆదాయపన్ను శాఖ అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. 2012, 2013లో ఐటీ అప్పీలెట్ ట్రైబ్యునల్ ని ఆశ్రయించింది. ఈ క్రమంలో సంస్థను ప్రారంభించకముందే.. రూ.350 ప్రీమియంతో భారీ ధరకు కట్టబెట్టారంటూ ఐటీ శాఖ వాదించింది. సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆదాయపన్ను శాఖ ట్రైబ్యునల్ ముందు వాదించింది. అంతేకాక సీబీఐ ఛార్జ్‌షీట్లను కూడా సమర్పించింది. నిధులు మళ్లించారని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నది.
ఇరు పక్షాల వాదనలు విన్న ఐటీ అప్పీలెట్ ట్రైబ్యునల్ 153 పేజీల తీర్పును వెలువరించింది. షేర్ ప్రీమియం బోగస్ అంటూ చేసిన వాదనకు ఆధారాలు లేవని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. జగతి పబ్లికేషన్ గానీ, అందులో పెట్టుబడి పెట్టిన సంస్థలు గానీ లెక్కల్లో చూపని ఆదాయంతో షేర్లు కొన్నట్లు ఆధారాల్లేవని ట్రైబ్యునల్ తెలిపింది. పెట్టుబడి పెట్టిన సంస్థలకు తగిన నెట్ వర్త్ , ఇతర ప్రామాణికాంశాలు ఉన్నాయని ట్రైబ్యునల్ తెలిపింది. అంతేకాక సాక్ష్యాలను పరిశీలించేటప్పుడు వాస్తవిక పత్రాలే ముఖ్యం తప్ప.. ఆధారాలు లేని ప్రకటనలను పరిగణలోకి తీసుకోమని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.
అంతేకాకుండా సూట్ కేస్ కంపెనీలంటూ ఐటీ శాఖ చేసిన వాదనలను ట్రైబ్యునల్ కొట్టి పడేసింది. జగతిలో పెట్టుబడి పెట్టిన కంపెనీలు నగదు రూపంలో చేయలేదని తెలిపింది. కొన్ని కంపెనీలు తమ అడ్రస్ మారిందంటూ సంప్రదించినా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిని పరిగణలోకి తీసుకోలేదని ట్రైబ్యునల్ అసహనం వ్యక్తం చేసింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీల ఆదాయంపై కలకత్తా ఆదాయపన్ను శాఖ ఇచ్చిన రిపోర్ట్ ను ట్రైబ్యునల్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఐటీ అప్పిలెట్ ట్రైబ్యునల్ తీర్పుతో.. మిగతా కేసుల్లో కూడా సీఎం జగన్ కు ఊరట లభిస్తుందని వైసీపీ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.