గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం కావాలనే.. టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లను ధ్వంసం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ ఇళ్లు ఎవరూ కూల్చలేదని.. తమకెవరి సానుభూతి అవసరం లేదని ఇప్పటం గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు, అనవసర పర్యటనలు మానుకుంటే మంచిదని ఇప్పటం వాసులు తేల్చి చెప్పారు. ఈ మేరకు గ్రామంలో ఫ్లెక్సీలు కట్టి మరీ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కూల్చివేతల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే ఇప్పటంలో పర్యటించి.. గ్రామస్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటం ప్రజలు మాత్రం దీనిని తప్పు పడుతున్నారు. రోడ్డు విస్తరణ కోసం అధికారులు.. కేవలం ఆక్రమంగా నిర్మించిన ప్రహరీలనే తొలగించారని.. ఎవరి ఇళ్లనూ కూల్చలేదని చెబుతున్నారు. కూల్చీవేతలు జరగకపోయినా ప్రతిపక్ష నేతలు దీనిపై అనవసర రాజకీయం చేస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎవరి సానుభూతి అవసరం లేదంటూ ఇప్పటం ప్రజలు ఇళ్లపై ఫ్లెక్సీలు కట్టి మరీ తమ నిరసన తెలియజేశారు.