2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రం అంతటా పాదయాత్ర చేస్తున్నారు. జనాల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు.. కష్టాలను కళ్లారా చూశారు. వారి బాధలను విన్నారు. ఇక పాదయాత్రలో ఎందరో తల్లిదండ్రులు వెళ్లబోసుకున్న గోడు ఒక్కటే. “అన్న.. మా పిల్లలకు మంచి చదువు కావాలి. ప్రైవేట్ బడులకు పంపేంత ఆర్థిక స్తోమత మాకు లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సరిగా లేవు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అప్పులు చేసి మరి ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నాం. కానీ అక్కడ అనుకున్నంత గొప్పగా లేదు. లక్షలు ఖర్చు చేసినా అరకొర వసుతులే. ఈ పరిస్థితులను మార్చు” అని కోరారు. ఇక కొందరు ఆడపిల్లలు పాఠశాలలో సరైన వసతులు లేక కొన్ని రోజుల పాటు స్కూల్‌కి వెళ్లడం లేదని.. దాని వల్ల చదువులో వెనకబడిపోతున్నాం అని తెలిపారు. మరి కొందరైతే ఏకంగా చదువు మానేశాం అని తెలిపారు. ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకున్న జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్యారంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.
దానిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా తీర్చిదిద్దడం కోసం మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్. పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 14న ‘నాడు-నేడు’ పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా దశలవారీగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలైన టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల ఏర్పాటు, సురక్షిత తాగునీటి సరఫర, పాఠశాలకు పెయింటింగ్, చిన్నా, పెద్ద మరమ్మతులు చేయించడం, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్స్, అన్ని స్కూల్స్‌కి కాంపౌండ్ గోడలు ఏర్పాటు చేయడం చేస్తారు. మొదటి దశలో భాగంగా ఇప్పటి వరకు 15,715 స్కూల్స్‌లో 3700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. కార్యక్రమాన్ని అమలు చేశారు.
ఓ కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం ఆ ఫ్యామిలీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఓ నాయకుడి ఆలోచన.. ఆ ప్రాంత ప్రజల జీవితాలను మారుస్తుంది.. అదే ఓ సీఎం తీసుకునే నిర్ణయం ఆ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అలానే సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చడం కోసం తీసుకొచ్చిన మనబడి నాడు నేను కార్యక్రమం మంచి ఫలితాలను ఇవ్వడమే కాక.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. జగన్ చేసిన ఆలోచన ప్రధాని మోదీలో కూడా కదలిక తీసుకువచ్చింది. ఏపీని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
సీఎం జగన్ ప్రారంభించిన నాడు-నేడు కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వ కూడా పీఎం శ్రీ (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీని కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలల్లో ప్రయోగశాలలు, ఆధునిక తరగతి గదులు, మంచి క్రీడా ప్రాంగణంతో పాటు, ఆర్ట్ స్టూడియోస్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక పర్యావరణ హితంగా ఈ పనులు జరగాలని కేంద్రం సూచించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల తలరాత మారడమే కాక ఎందరో విద్యార్థులకు మేలు చేకూరుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీలో మన బడి – నాడు నేడు కార్యక్రమం 2019-20 నుంచి ప్రారంభం అయ్యింది. మూడేళ్ల వ్యవధిలో దశల వారీగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. పంచాయత్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్లు ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల కింద నిర్వహిస్తున్న (రెసిడెన్షియల్ పాఠశాలలు సహా) మొత్తం 44,512 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. మొదటి దశలో భాగంగా 15,715 పాఠశాలలలో ఈ కార్యక్రామాన్ని అమలు చేశారు. దీనికి దాదాపు రూ. 3700 కోట్లు ఖర్చు అయ్యింది.
ఇక సీఎం జగన్ చేసిన ఆలోచన మంచి ఫలితాలను ఇస్తుంది. సరికొత్త హంగులతో.. చక్కిన పెయింటింగ్స్‌తో.. అన్ని రకాల సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అందంగా ముస్తాబైన స్కూల్స్‌ని చూస్తే.. గవర్నమెంట్ బడి అంటే నమ్మడం కష్టం. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో.. తల్లితండ్రుల ఆలోచనలో మార్పు వచ్చింది. లక్షలు ఖర్చుచేసి.. కిక్కిరినట్లుండే ప్రైవేట్ పాఠశాలలకు పంపండం కన్నా.. అన్ని సౌకర్యాలతో ఉచిత విద్య అందించే ప్రభుత్వ బడులకు పంపడం ఎంతో మేలు అని ఆలోచిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరగడమే కాక.. డ్రాపౌట్స్ శాతం కూడా తగ్గినట్లు తెలుస్తోంది. ఇక సీఎం జగన్ ఆలోచన ఎన్నో రాష్ట్రాలకే కాక ఏకంగా ప్రధాని మోదీకి స్ఫూర్తిగా నిలవడం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దేశానికి ఆదర్శంగా నిలిచిన సీఎం జగన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.