ఒకప్పుడు భిక్షాటన చేసిన కుర్రాడు ఇప్పుడు ఓ పోలీస్ అధికారి స్థాయికి ఎదిగారు. పెళ్లి ఫంక్షన్స్ కి, కర్మకాండలు జరిగే ప్రదేశాలకు వెళ్లి ఏదో ఒక పని చేసి భోజనం సంపాదించుకునే కుర్రాడు ఇవాళ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన ఎవరో తెలుసా?
ప్రతి ఒక్కరి గతాన్ని తవ్వితే ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు ఉంటాయి. అయితే ఎన్ని కష్టాలు, సమస్యలు, బాధలు ఉన్నా ఓర్చుకుని ఉన్నతమైన స్థాయికి చేరుకునేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఒకప్పుడు భిక్షాటన చేసుకునే చిన్న కుర్రాడు ఇప్పుడు పోలీస్ అయ్యాడు. అసలు రోడ్ల మీద చేయి చాచి భిక్షాటన చేసుకునే వారి జీవితాలు మారిపోతాయని ఎవరూ ఊహించలేరు. కానీ తన భవిష్యత్తును ఎవరికి వారు రాసుకోగలిగితే బ్రహ్మ రాసిన గీతలు చిరిగిపోయి తలరాతలు ఇట్టే మారిపోతాయి. అలా తన తలరాతను మార్చుకున్న వ్యక్తి ఒకరున్నారు. ఆయనే అనంతపురం ఏఎస్పీ హనుమంతు. తాజాగా ఆయన ఓ సందర్భంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిన్నతనంలో తాను అనుభవించిన కష్టాలను వివరించారు. రాయలసీమ జిల్లాలను కరువు జిల్లాలని అంటారని.. తాను కూడా రాయలసీమ వాసినే అని అన్నారు. తినడానికి తిండి లేక చిన్న వయసులో భిక్షాటనకు వెళ్లానని అన్నారు. ఒకరోజు భిక్షాటన చేసి చెట్టు కింద కూర్చుని అన్నం తింటుండగా బడికి పోయే పిల్లలను చూశారట. తినడం మానేసి వాళ్ళని అలానే చూస్తూ ఉండిపోయారట. అప్పుడు ఆయన తల్లి గారు బడికి తీసుకెళ్తే.. భిక్షాటనకు వచ్చారనుకుని ఇక్కడ అన్నం పెట్టమని చెప్పి బయటకు గెంటివేశారని అన్నారు. చినిగిన దుస్తుల్లో చూసి అలా అనుకున్నారని అన్నారు. పలక ఉంటే చదువుకోవడానికి వచ్చాడని అనుకుని తన కొడుకును రానిస్తారని.. ఆయన తల్లి ఆయనకు ఒక పగిలిపోయిన పలక ఇచ్సి పంపించారు.
టీచర్ ఆయన దగ్గరున్న పలక చూసి బడిలో చేర్చుకున్నారు. అయితే పిల్లలు తనను పక్కన కూర్చోబెట్టుకోలేదని బాధపడ్డారట. అయితే తన టీచర్ పిల్లలను మందలించి తనతో ఫ్రెండ్ షిప్ చేసేలా చేశారని అన్నారు. అంతేకాదు తన టీచర్ వేసుకోవడానికి తనకు మంచి బట్టలు కూడా ఇచ్చారని అన్నారు. స్కూల్ నుంచి రాగానే మల్లెపూలు అమ్మేవాడినని అన్నారు. అన్నం కోసం పెళ్లిళ్లు జరిగే చోటుకు, ఎవరైనా చనిపోతే వారి ఇళ్లకు వెళ్లి పని చేసేవాడినని.. సమాధి తవ్వడానికి కూడా వెళ్లానని అన్నారు. సమాధి తవ్వినందుకు అన్నం పెట్టి కొంత డబ్బు ఇచ్చేవారని అన్నారు. అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకుని ఐపీఎస్ చేశానని అన్నారు. తమ ఆర్థిక పరిస్థితిని చూసి హేళన చేసిన వారు ఇప్పుడు తమ స్థాయిని చూసి అభిమానిస్తున్నారని అన్నారు. తన అమ్మను ఒకప్పుడు చాలా మంది తిట్టేవారని.. అలా తిట్టినవారు ఇప్పుడు చేతులెత్తి నమస్కరిస్తున్నారని అన్నారు. ఆయన ఎదిగిన తీరు చూసి నెటిజన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అనంతపురం ఏఎస్పీ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.