ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ పై పోలీసుల చర్యలు తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు విధుల్లో ఉండగా సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులనూ అసభ్య పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పోలీసుల వరకూ చేరగా.. ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఆయనపై విచారణ జరపడం.. ఆయన సీఎంను దూషించినట్లు నిర్ధారణైంది. దీంతో చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
తన్నీరు వెంకటేశ్వరరావు చిల్లకల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైవే పెట్రోలింగ్ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా గౌరవరంలో టీ తాగేందుకు ఓ టీ కొట్టు దగ్గర ఆగారు. ఆ సమయంలో టీస్టాల్ వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య సంభాషణ జరిగింది. మీ జీతాల పరిస్థితి ఏంటనీ కానిస్టేబుల్ ను టీస్టాల్ వ్యక్తి ప్రశ్నించారు. దీంతో సీఎం జగన్ పై కానిస్టేబుల్ అనుచిత పదజాలాన్ని వినియోగించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై కూడా నోరు పారేసుకున్నారు. వీరి సంభాషణను అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనను ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా.. దూషించినట్లు తేలింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.