ఏపీలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు గాను వినూత్న ఆలోచన చేశారు. దానిలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. పెన్షన్లు మొదలు.. ప్రభుత్వ పథకాల గురించి లబ్ధిదారులకు చెప్పడం.. వారితో అప్లై చేయించడం.. తదితర కార్యక్రమాలను సచివాలయ వ్యవస్థ ద్వారా సక్రమంగా నిర్వర్తిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే వీటి ద్వారా ఉన్న ఊళ్లోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 540 రకాలకు పైగా సేవలను అందిస్తున్న సర్కారు.. ఇప్పుడు కొత్తగా వాటిల్లో ఏటీఎం సేవలను అందించేందుకు చర్యలను చేపట్టింది.
ఈ నేపథ్యంలో తొలి దశలో వచ్చే ఉగాది నాటికి కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సచివాలయంలో ఈ ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. రెండో దశలో రెవెన్యూ డివిజన్‌లో కార్యకలాపాలు ఎక్కువగా సాగే ఒక సచివాలయంలోను.. మూడో దశలో మండల కేంద్రాల్లో కార్యకలాపాలు అత్యధికంగా జరిగే ఒక సచివాలయంలోను ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చర్యలను చేపట్టింది.ఏపీలోని 9,160 రైతుభరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించగా.. 4,240 కేంద్రాల్లో ఇప్పటికే వీరు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలందిస్తున్నారు. మరో 2,500 సచివాలయాల్లో వచ్చే ఉగాది నాటికి ఈ సేవలనూ అందుబాటులోకి తేనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతుభరోసా కేంద్రాల కార్యకలాపాలు అత్యధికంగా ఉన్నచోట తొలిదశలో ఉగాది నాటికి జిల్లాకొక సచివాలయంలో ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన కొనుగోళ్లు చేసే రైతులతోపాటు ఇతరులకూ ఈ ఏటీఎంలు ఉపయోగపడతాయని, క్రమంగా రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోని ఒక్కో సచివాలయంలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని అజయ్ జైన్ పేర్కొన్నారు.