ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు ఏవైనా వారు చెప్పిందే ఫీజు. చెప్పినంత కట్టడం తప్ప తల్లిదండ్రులకు పెద్ద ఆప్షన్స్ ఉండవు. ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలకు నిర్ధిష్టమైన ఫీజులు ఖరారు చేయాలని ఎప్పటినుంచో ఉన్న వాదనే. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏపీలో ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సంవత్సర ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఫీజుల వివరాలతో ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ గత ఏడాదిలోనే ఫీజులపై నోటిఫికేషన్ జారీచేసినా న్యాయవివాదంతో అమలు కాలేదు. వాటిని పరిష్కరించుకుని ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వానికి కొద్దిరోజుల కిందట సిఫార్సులు అందించింది. వాటి ఆధారంగా ప్రభుత్వం మంగళవారం జీవో 53, 54లను విడుదల చేసింది. ఫీజులను కూడా పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరాల వారీగా నిర్ణయించింది. సాధారణంగా ప్రైవేటు పాఠశాలలో ఫీజు అంటే ఒకపట్టాన ఉండదు. ట్యూషన్ అని, స్టడీ మెటీరియల్, ల్యాబ్, కల్చరల్ యాక్టివిటీస్ ఇలా ఎన్నో ఉంటాయి. ప్రభుత్వం అలాంటి ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్ ల్యాబొరేటరీ, లైబ్రరీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, స్టూడెంట్ వెల్ఫేర్, స్టూడెంట్ హెల్త్ కేర్, స్టడీ టూర్ తదితర ఫీజులన్నీ ఇందులో కలిపి ఉంటాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని పేర్కొంది. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేస్తే.. రవాణా ఛార్జీల కింద కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని తెలిపింది. హాస్టళ్ల ఫీజులనూ నిర్దేశించింది. ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలకు ఫీజును నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.