తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కూడా పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఎటూ కాని సమయంలో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. మండు వేసవిలో వర్షాలు కాస్త ఊరటనిచ్చిన నిరంతరాయంగా కురుస్తుండడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కారణంగా పటాన్ చెరువు, గచ్చిబౌలి, లింగంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, మల్లేపల్లి, ఆసిఫ్ నగర్, కార్వాన్ ప్రాంతాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రెండు గంటల వ్యవధిలో 8 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి సంగారెడ్డి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల పరిధిలో 4.8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవ్వగా.. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. ఇక ఏపీలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, కోస్తాలలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈదురుగాలులతో కూడిన వర్షాలు వస్తాయని, మరో 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తున్నప్పుడు చెట్ల కింద ఉండవద్దని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సూచించింది. ముఖ్యంగా రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఊహించినట్టుగానే ఒడిశా వైపు నుండి శ్రీకాకుళం జిల్లా అంతటా భారీ ఉరుములు, వడగండ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి. టెక్కలి, సోంపేట మధ్య ప్రదేశాల్లో తీవ్రమైన మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది.
అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, పిడుగులు పడే అవకాశం ఉందని అంటున్నారు. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాతో పాటు యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంటున్నారు దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు.
రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపుల వర్షంతో కూడి “పిడుగులు” పడే అవకాశం ఉంది. ఎక్కడైనా ఎపుడైనా ఉరుములు మెరుపులతో వర్షం ఉన్నప్పుడు చెట్ల కింద ఉండరాదు.రైతులు,కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలి.
-బిఆర్ అంబేద్కర్,ఎండి,APSDMA pic.twitter.com/6JNdl3fCPk— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) April 25, 2023