తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఎండలు ఏ రేంజ్ లో మండిపోయాయో అందరికీ తెలిసిందే. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మొన్నటి వరకు ఎండలతో బాధపడుతుంటే.. ఇప్పుడు అకస్మాత్తుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాలు పడ్డాయి. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుకుంది.. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ వర్షాలు మరో రెండు రోజుల వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి వరి ధాన్యం తడవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇక ఏపిలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కొన్ని చోట్ల ఇప్పటికే వానలు పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా వర్షంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు చనిపోయారు. కుప్పం-మల్లనూరు దగ్గర రోడ్డుపై చెట్టు విరిగి పడగా.. ఓ వాహనంలో ప్రయాణిస్తున్న వారికి గాయాలు అయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.