ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెండు రాష్ట్రాల మధ్య కొత్త హైవే నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..
దేశవ్యాప్తంగా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రోడ్లు మెరుగయ్యాయని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా గత ఆరేడేళ్లలో సాధారణ రహదారులతో పాటు హైవేల అభివృద్ధి కూడా బాగా జరిగిందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే అంతర్రాష్ట్ర రోడ్ కనెక్టివిటీ మరింత మెరుగుపడిందని మెచ్చుకుంటున్నారు. రహదారుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారంటూ కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలాఉండగా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర సర్కారు శుభవార్త అందించింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణలోని ఎన్‌హెచ్-163 మీద ఖమ్మం-విజయవాడ మధ్య 4 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవేను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కొత్త హైవే నిర్మాణం చేపడుతున్నట్లు నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వి.వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య తొలి ప్యాకేజీలో భాగంగా ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో 29.92 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు గడ్కరీ తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.983.90 కోట్లు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల వాహనాల నిర్వహణ వ్యయంతో పాటు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని వ్యాఖ్యానించారు. దీంతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య రహదారి వసతులను పెంచడం.. అలాగే దక్షిణాదిలోని పోర్టులను సెంట్రల్ ఇండియాతో అనుసంధానించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
📢 Telangana
👉 In Telangana, we are developing a 4-Lane Access-Controlled Greenfield Highway section on NH-163G (Khammam-Vijayawada) from V. Venkatayapalem village to Brahmanapalli(K) village under the Economic Corridor (NH-O) program…
— Nitin Gadkari (@nitin_gadkari) March 14, 2023