గుప్త నిధులు.. తరచూ ఈ మాట వినిపిస్తూనే ఉంటుంది. నిధుల కోసం తవ్వకాలు చేశారని, గుడులను ధ్వంసం చేశారని వింటూ ఉంటాం. పూర్వీకులు దొంగల భయంతో వారి వద్దనున్న బంగారం, ఆభరణాలను గుంతతీసి దాచిపెట్టేవారు. తర్వాత తాత, ముత్తాల సమయంలో ఇల్లు కట్టుకునే సమయంలో గోడల్లో దాచిపెట్టే వారు. అలా ఓ కుటుంబం గోడలో దాచిపెట్టిన ఐరన్ లాకర్ ఒకటి విజయనగరం జిల్లా రాజాంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.
రాజాంలో ఓ పురాతన ఇంటిని కూలుస్తున్న సమయంలో ఓ ఐరన్ లాకర్ బయటపడింది. అయితే కూలీలు ఆ విషయాన్ని యజమానికి చెప్పకుండా గోప్యంగా ఉంచారు. చివరికి ఆ విషయం ఆనోటా ఈ నోటా పడి చివరికి ఇంటి యజమాని వరకు చేరింది. ఆ లాకర్‌లో 2 కేజీల బంగారం ఉందంటూ ప్రచారం జరిగింది. గుప్త నిధులు ఉన్నాయి అంటూ ప్రచారాలు జోరందుకున్నాయి.
వెంటనే ఆ యజమాని కూలీలతో గొడవకు దిగాడు. తమకు చెందిన లాకర్ తిరిగి ఇవ్వాలంటూ పట్టుబడ్డాడు. వారు అడ్డం తిరగడంతో వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి ఆ లాకర్ ను తిరిగి దక్కించుకున్నారు. ఆదివారం ఆ లాకర్ ను అధికారుల ఎదుట ఆ లాకర్‌ను ఆదివారం పగలగొట్టారు. దానిని పగలగొట్టి చూడగా అధికారులు, యజమాని కంగుతిన్నారు.
ఆ పాత ఇనుప లాకర్ ను పగలగొట్టి చూడగా.. అందులో తుక్కు కాగితాలు, రెండు మూడు నాణేలు మాత్రమే ఉన్నాయి. అది చూసి గుప్తనిధులు ఉన్నాయంటూ జరిగిన ప్రచారాలకు తెర పడింది. అంతేకాకుండా మూడ్రోజులుగా రాజాం ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠ నీరుగారి పోయింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.