తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తులతో రద్దీగా ఉంటే తిరుమలలో కరోనా మహమ్మారి కారణంగా కొన్నాళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. తితిదే అధికారులు కరోనా కట్టడికి కొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. అయితే తాజాగా శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. గతంలో కొవిడ్ తీవ్రత కారణంగా ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ తితిదే నిలిపివేసిన విషయం తెలిసింది.
తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆఫ్ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. 16వ తేదీ స్వామి వారి సర్వదర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9గంటలకు భక్తులకు టోకెన్లు జారీ చేయనున్నట్లు తితిదే తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టోకెన్లు పొందవచ్చునని తితిదే అధికారులు తెలిపారు. కాగా, ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా రోజు వారీ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరి తితిదే తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.