ప్రజా శ్రేయస్సు కోసం నవరత్నాలతో పథకాలను రూపొందించి, లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది జగన్ సర్కార్. ఇప్పటికే పలు పథకాలను అమలు చేసింది. తాజాగా ఆడ పిల్లలకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు దూసుకెళుతుంది. ప్రజా శ్రేయస్సు కోసం నవరత్నాలతో పథకాలను రూపొందించి, లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఇప్పటికే అవ్వలు, తాతలకు ఇచ్చే వృద్ధాప్య ఫించనును పెంచింది. విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది. వైఎస్సార్ ఆసరా, జగనన్న వసతి దీవెన, ఈబీసీ నేస్తం పథకాల కింద లబ్దిదారులు ప్రయోజనాలను పొందారు. అయితే ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెళ్లిళ్లకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్ధిక సాయం అందిస్తుంది జగన్ సర్కార్. కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్ధ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ పథకాన్ని లబ్దిదారులకు అందిస్తున్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి డబ్బుల్ని అకౌంట్లలోకి జమ చేయనున్నారు. ఈ త్రైమాసికంలో(జనవరి టూ మార్చి) వివాహం చేసుకున్న లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద.. అర్హులైన 12,132 మందికి రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేస్తారు.
అయితే ఈ నగదును పెళ్లి కుమార్తె తల్లి ఖాతాలో పడనున్నాయి. తల్లి లేకపోతే వధువు నిర్ణయాన్ని బట్టి తండ్రి ఖాతాలో లేదా ఇతరుల అకౌంట్లలో జమ చేస్తారు.ఈ పథకానికి అర్హులు, అర్హతలు ఏంటంటే.. వధువుకు 18 ఏళ్లు నిండి ఉండాలి, వరుడికి 21 ఏళ్లు దాటాల్సిందే. బాల్య వివాహాలు అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నారు. అలాగే వరుడు పదో తరగతి కచ్చితంగా పాస్ కావాల్సిందే అని నిబంధన ఉంది. నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు ఉన్నవాళ్లు ఈ పథకాలకు అర్హులు. గ్రామీణాల్లో మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలు ఉన్నవాళ్లు మాత్రమే అర్హులు. వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి ఉండకూడదు. అలాగే విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. నాలుగు చక్రాల వాహనం ఉండరాదు.
పారిశుద్ధ్య కార్మికుల మినహా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పథకానికి అనర్హులు. పెళ్లై, ఈ పథకానికి అర్హులైన వారు.. సమీపంలోని గ్రామ,సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పెళ్లైన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించాక.. అర్హుల జాబితాను విడదుల చేస్తారు. లబ్దిదారుల్లో ఎవరి ఖాతాల్లో ఎంతెంత జమ కానున్నాయంటే.. ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, మైనారిటీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. అలాగే వీరి కులాంతర వివాహానికి రూ.75 వేలను అందించనున్నారు. ఇవి నేరుగా వధువు ఖాతాల్లో జమ కానున్నాయి. దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు రూ.40 వేల ఆర్థిక సాయం అందజేస్తోంది ప్రభుత్వం.