ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే విద్యార్థుల సంక్షేమం, విద్య కోసం కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బుధవారం వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో భాగంగా నిర్వహించిన విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీల పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకోసం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే.. ఆ మొత్తాన్ని వారి తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
పేద పిల్లలు అందరూ ఉన్నత విద్యను అభ్యసించాలనే సంకల్పంతో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందే విద్యాదీవెన పథకం. ఇందులో భాగంగా ఏపీలో అర్హులైన విద్యార్థులకు వారి వారి విద్యను బట్టి.. వారికి పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ చదివే విద్యార్థులకు రూ.20 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ స్టూడెంట్స్ కి రూ.10 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కళాశాలలకు విద్యార్థులు కట్టాల్సిన ఫీజుని మూడు నెలలకొకసారి విడుదల చేస్తుంటారు. అయితే ఏ కళాశాల యాజమాన్యం కూడా ఫీజు విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలా ఏ కళాశాల యాజమాన్యం అయినా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. యాజమాన్యాలు ఫీజు కోసం ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు చర్యలు కూడా ప్రారంభించారు. అందుకోసం 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏ కాలేజ్ యాజమాన్యం అయినా విద్యార్థులను ఇబ్బందులుకు గురిచేస్తే ఈ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయచ్చు. విద్యార్థులు, తల్లిందండ్రులు ఎవరు ఫిర్యాదు చేసినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్లే కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడే విధంగా ఏర్పాటు చేశారు.