ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు సంచలనాత్మకంగా ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో వస్తారో తెలియదు కానీ ప్రజలతో శభాష్ అనిపించుకుంటారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దృష్ట్యా, పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆయన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారు. రీసెంట్ గా పర్యావరణం కోసం ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా వాయు, శబ్ద కాలుష్యాలు లేకుండా నడిచే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల కోసం ఈ-స్కూటర్లను అందించాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం ప్రభుత్వమే ఫైనాన్స్ మీద ఉద్యోగులకు విద్యుత్ వాహనాలను ఇవ్వనుంది.
ప్రతీ రోజూ ఆఫీసులకు, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనాలను వినియోగించే వారు చాలా మందే ఉన్నారు. అయితే రోజు రోజుకీ పెట్రోల్ ధరలు పెరిగిపోతుండడంతో ఉద్యోగుల మీద ఆర్ధిక భారం పడుతోంది. పైగా వాహన కాలుష్యం తగ్గుతుంది. అందుకే ఉద్యోగులను ప్రోత్సహించేలా ఈ-స్కూటర్లను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ ఈ-స్కూటర్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వనుంది. అయితే ఈ ఈ-స్కూటర్లను ఫైనాన్స్ మీద 60 నెలల పాటు వాయిదా పద్ధతిలో చెల్లించి కొనుక్కునేలా వెసులుబాటు కల్పిస్తోంది. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఫైనాన్స్ మీద ఈ వాహనాలను అందించనుంది. అయితే సదరు ఉద్యోగి పని చేసే సంస్థ నిర్వాహకుడు (మేనేజర్, సీఈఓ తదితరుల) నుంచి ఆ ఉద్యోగి ప్రతి నెలా ఈఎంఐ చెల్లించేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (నెడ్ క్యాప్) అధికారులు ఇందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వస్తే.. ఉద్యోగులకు తక్కువ కరెంట్ వినియోగంతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. పెట్రోల్ భారం కూడా తగ్గుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 10 వేలకు పైగా ఈ-స్కూటర్లు, ఈ-కార్లు తిరుగుతున్నాయి. ఈ వాహనాల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్ క్యాప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి స్థలాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ అయ్యేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ఛార్జింగ్ స్టేషన్లని అందుబాటులోకి తీసుకురానున్నారు.
వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-స్కూటర్లను అందజేస్తుంది. ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా అందజేయనుంది. మరి పెట్రోల్ భారం తగ్గేలా, పర్యావరణ హితం కోసం ఆలోచించి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈ-స్కూటర్లను అందజేయాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.