రైల్వే ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకాం చుట్టింది. అతి తక్కువ దరకే ఆహారాన్ని అందించి పేద, మధ్య తరగతి ప్రజల ఆకలి తీర్చే విధంగా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో ఎంతో మంది ప్రయాణికుల ఆకలి తీరనుంది.
నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజాధారణ పొందింది భారతీయ రైల్వే. ప్రయాణికుల సౌకర్యార్థం పలు మార్పులకు శ్రీకారం చుడుతూ రవాణా వ్యవస్థలో కీలకంగా మారింది. ఇక సౌత్ సెంట్రల్ రైల్వే విషయానికొస్తే.. రోజు వేల మంది ప్రయాణికులు సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు. ప్రయాణ సమయంలో వారికి ట్రైన్ లో సరియైన ఆహారం లభించదు. ఒక వేళ లభించిన ధర ఎక్కువగా ఉండడంతో తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు. మామూలుగా ట్రైన్లలో అమ్మే ఫుడ్ ధర ఎక్కువగా ఉండడం, క్వాలిటీ ఉండకపోవడంతో ప్రయాణికులు ఆ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే మంచి భోజనం అందించాలని నిర్ణయం తీసుకుంది.
రైలు ప్రయాణం చేసేటపుడు ప్రయాణికులు కొందరు దూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. వారిలో పేదలు, మధ్య తరగతి ప్రజలు స్టేషన్ల లో గాని ట్రైన్లలో గాని లభ్యమయ్యే ఆహార పదార్థాలను కొనలేక ఇంటి వద్ద నుంచే ఆహారాన్ని, ఇతర ఆహార పదార్థాలను తమ వెంట తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే ప్రయాణికులకు అతి తక్కువ ధరకే నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమైంది. ఎస్ సీఆర్ పరిధిలోని కొన్ని రైల్వే స్టేషన్లలో భోజనం అందించేందుకు ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్ రైల్వేస్టేషన్లలో సాధారణ ప్రయాణికులకు తక్కువ రేటుకే భోజనం అందించేందుకు సిద్ధమైంది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) జన్ అహార్ ద్వారా భోజనం అందిస్తోంది. దీనిలో భాగంగానే ఈ నాలుగు రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫామ్ పై జనరల్ బోగీలు నిలిచే చోట స్టాల్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఈ స్టాళ్ల ద్వారా రూ.20, రూ.50కే నాణ్యమైన భోజనం, ఇతర ఆహార పదార్థాలు అందిస్తోంది. ఎకానమీ భోజనం ధర రూ. 20 కాగా దీనిలో ఊరగాయ, ఏడు పూరీలు, 150 గ్రాముల వెజ్ కర్రీ అందిస్తున్నారు. రూ. 50కే కాంబో భోజనం అందిస్తున్నారు. దీనిలో భోజనంతో రాజ్మా రైస్, పావ్ భాజీ, చోలే ఖాతురే, చోలే కుల్చే ఆహార పదార్థాలు ఉండనున్నాయి. ఇప్పటికే రూ. 3కే 200 మి.లీ వాటర్ బాటిల్ అందిస్తుండగా ఇప్పుడు అతి తక్కువ ధరకే భోజనం అందించనుండడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.